యాదాద్రి భువనగిరి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వివిధ మార్గా ల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గణేశ్ ఉత్సవ నిర్వాహకులు ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతున్నాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా లో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో సత్యనారాయణ తెలిపారు. ప్రత్యామ్నాయంగా సెప్టెంబర్ రెండో శనివారం సూళ్లు నడపాలని సూచించారు.
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నా యి. రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై, మేఘా లు దట్టంగా కమ్ముకున్నాయి. సూర్యుడు కనిపించడమే గగనమైంది. భువనగిరిలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదగిరిగుట్టలో 12.8, రాజాపేట 9.3, తురపల్లిలో 8.5, బొమ్మలరామారంలో 8.3, ఆత్మకూర్(ఎం) 7.8 సెంటిమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది. సీజన్ ప్రారంభంలో వరుణుడు అంతంత మాత్ర మే కరుణించగా, ఇటీవల వరుసగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో సగటు కంటే 78శాతం అధికంగా వర్షాలు కురిశాయి. సగటు సాధారణ వర్షపాతం అంచనా 355.9మి.మీ. కాగా, ఇప్పటి వరకు 632.3మి. మీ. వర్షపాతం నమోదైంది. మూడు మండలాలు మినహా అన్ని చోట్లా అత్యంత భారీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో శుక్రవారం వారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాలతో భువనగిరి-చిట్యాల రోడ్డు మార్గంలో రాకపోక లు నిలిచిపోయాయి. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి-నందనం మధ్యలో ఉన్న కాలువ నీటి ప్రవాహంతో చిట్యా ల -భువనగిరి రహదారిని బంద్ చేశారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం ఉదయం నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలు పునరుద్ధరించారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. వలిగొండ మండలంలోని సంగం వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగం-బొల్లెపల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరా యం ఏర్పడింది. రామన్నపేట మండలంలో మూసీ ప్రభా వం వల్ల మునిపంపుల-లక్ష్మిపురం గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. యాదగిరిగుట్ట మండలంలోని చొల్లేరు, సైదాపురం, గొల్ల గుడిసెల వాగులు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు ఆటంకం కలుగుతున్నది. ఆత్మకూరు (ఎం) మండలంలో బికేరు వాగు ప్రవహించడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. గంధమల్ల చెరువు అలుగుపోస్తుండడంతో రాజాపేట మండలంలో పొట్టిమర్రి వాగులోని రోడ్డు డ్యాం పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిపివేశారు. ఆలేరు మండలంలోని కొలనుపాకలో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించి.. ప్రజలు ఇబ్బందులకు గురయ్యా రు. తురపల్లి మండలం గంధమల్ల చెరువులోకి వస్తున్న వరదతో జగదేవపురం-గంధమల్ల రోడ్డులో రాకపోకలు ఆటంకం ఏర్పడుతున్నది. బీబీనగర్ పోలీస్స్టేషన్ ఎదురు గా సర్వీసు రోడ్డు పైనుంచి చిన్నేరు వాగు ప్రవహిస్తున్నది.
యాదగిరిగుట్ట వ్యాప్తంగా 90 చెరువులకు గానూ 80 చెరువులు నిండుకుండలా మారాయి. పలు చెరువులు మత్తడి దుంకుతున్నాయి. బీబీనగర్, రాజాపేట మండలాల్లోని చెరువులు అలుగు పోస్తున్నాయి. పోచంపల్లి పెద్ద చెరువు మత్తడి దుంకుతున్నది. తురపల్లి మం డల వ్యాప్తంగా కురిసిన వర్షానికి చెరువులన్నీ నిండుకుండలుగా మారాయి. మండలంలో 78 చెరువులు అలుగులు పోస్తుండగా మరో 58 చెరువులు 75 నుంచి 100శాతం నిండాయి.
నల్లగొండ రూరల్, ఆగస్టు 28: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్లగొండ మండలంలోని పలు వాగులు, వంకలు, చెరువుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఖాజీ రామారంలోని పెద్ద చెరువు నిండి బుధవారం రాత్రి నుంచి ఆలుగుపోస్తోంది. దీంతో గ్రామంలోని కొత్త కుంట చెరువు కట్టకు గురువారం గండి పడింది. దీంతో 50 ఎకరాలు నీట మునగడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. పెద్ద చెరువు కింద ఉన్న కొత్తకుంట చెరవు విస్తీర్ణం 5.36 ఎకరాలు ఉండాల్సి ఉండగా, అంతా ఆక్రమణకు గురై 30 గంటలు మాత్రం మిగిలిందని, పెద్ద చెరువు భారీగా అలుగు పోస్తుండడంతో ఆక్రమణదారుల బండారం బయటపడుతుందని, లేదా పైన ఉన్న పంట పొలాలు మునుగుతాయని రాత్రికి రాత్రే కట్టకు కొత్త కుంట చెరువుకు గండికొట్టారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మిషన్ కాకతీయలో భాగంగా పెద్ద చెరువు అలుగు దగ్గర నీరు వెళ్లేలా ఒక గూనను ఏర్పాటు చేశారని, కొందరూ రైతులు తమ పొలాలు మునుగుతాయనే సాకుతోనే కట్టను తెచ్చారంటూ గ్రామస్తులు పేర్కొంటున్నారు. నల్లగొండ నీటి పారుదల శాఖ అధికారుల గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి వరద తగ్గగానే గండి పూడుస్తామని వెల్లడించారు. ఇంతికి గండి పడిందా… పెట్టారా అనే అంశంపై ఇంటెలిజెన్స్ వారు వచ్చి గ్రామస్తుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆక్రమించుకున్న కొత్త కుంట చెరవు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.