అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం మొదలైన వాన ఆదివారం కూడా కొనసాగింది. సూర్యాపేట జిల్లాలో కురిసిన అతి భారీ వర్షపాతం అతలాకుతలం చేసింది. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో 30 సెంటీ మీటర్లు, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ఎక్కడ చూసినా పోటెత్తున్న వరద దృశ్యాలే కనిపిస్తున్నాయి. భారీ వర్షానికి వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. పలుచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అక్కడక్కడ ఇండ్లు కూలాయి. చెట్లు విరిగి పడగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వరదతో లక్షలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద ధాటికి రోడ్లు కోతకు గురయ్యాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
వర్షం పోయినా పోటెత్తిన వరద
వర్షం తగ్గినా వరద పోటెత్తడంతో సూర్యాపేట జిల్లాలో దాదాపు 18 గంటలపాటు జన జీవనం స్తంభించింది. పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కోదాడలో వరద ఉధృతిలో కొట్టుకుపోయిన కారులో నాగం రవి(36), బైక్ కొట్టుకుపోయి ఎరమల్ల వెంకటేశ్వర్లు(56) మృతి చెందారు. పట్టణాల్లో సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్లలోకి నీరు చేరడంతో నిత్యావసర సరుకులు, ఇతర సామగ్రి తడిసిపోవడంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. రహదారులపై నీళ్లు ప్రవహించాయి. అన్ని శాఖలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, అదనపు కలెక్టర్ లత జిల్లా వ్యాప్తంగా పర్యటించి సహాయక చర్యలను పరిశీలించారు.
పంటలకు తీవ్ర నష్టం
ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి సూర్యాపేట జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు నీట మునిగాయి. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలతోపాటు కోదాడ పరిధిలోని మోతె, మునగాల, నడిగూడెం, హుజూర్నగర్ పరిధిలోని మేళ్లచెర్వు, పాలకవీడు, మఠంపల్లి ప్రాంతాల్లో వేసిన పత్తి, పెసర, వరి పంటలు నీట మునిగాయి. వరద ప్రవాహంతో పంట పొలాల్లో మట్టి మేటలు పేరుకుపోయాయి. సాగర్ ఆయకట్టు అయిన కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఇటీవల నాట్లు వేస్తుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా వర్ష బీభత్సం, వరదల నేపథ్యంలో పరిస్థితిని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరా తీశారు. సోమవారం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో వర్షంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు.
సాగర్, మూసీ కాల్వలకు గండ్లు
వరద పోటెత్తడంతో కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు గండి పడింది. దాంతో రామచంద్రాపురం గ్రామంలోకి నీళ్లు చేరడంతో జలదిగ్బంధంలో చిక్కుకుంది. పంటలు నీటమునిగాయి. సూర్యాపేట మండలం పిల్లలమర్రి సమీపంలో మూసీ ఎడమ కాల్వకు గండి పడింది. దీంతో పంట పొలాలు నీట మునిగాయి. మూసీ అధికారులు వెంటనే ఇసుక బస్తాలు వేసి గండిని పూడ్చారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఎన్ఎస్పీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన గండిని పూడ్చే ప్రక్రియను ప్రారంభించారు.
భారీ వర్షాలపై మంత్రి కోమటిరెడ్డి ఆరా
నీలగిరి : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని పరిస్థితులపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం ఆరా తీశారు. జిల్లాలోని తాజా వాతావరణ పరిస్ధితులపై ఎప్పటికప్పుడు కలెక్టర్‌తో సమాచారం తెప్పించుకొని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఏ ఒక్కరూ విధులకు గైర్హాజరు కాకుండా చూసుకోవాలని కలెక్టర్ నారాయణరెడ్డిని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని
తెలిపారు.