వారం రోజుల నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భిన్నంగా నమోదవుతున్నాయి. రాత్రి పూట చలి వణికిస్తుండగా, పగలు ఎండ సుర్రుమంటున్నది. రాత్రి పూట సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తగ్గడం లేదు. ప్రస్తుతం సూర్యుడు దిశ మారే సమయం కావడంతో పగలు ఎండ దంచికొడుతున్నట్లు వాతావరణ శాఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పగలు గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వరకు, రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత 14 డిగ్రీల దిగువకు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు ఇటు చలికి, అటు ఎండకు ఇబ్బంది పడుతున్నారు.
నల్లగొండ, ఫిబ్రవరి 24 : ఫిబ్రవరి నుంచి వేసవి కాలం ప్రారంభమైన్నప్పటికీ ఎండ తీవ్రత మార్చి చివర నుంచి పెరుగుతుంది. అయితే ఈసారి ఫిబ్రవరి పూర్తి కావొస్తున్నప్పటికీ ఉష్ణోగ్రతలు రాత్రి, పగలు భిన్నంగా నమోదవుతున్నాయి. పగలు ఎండ తీవ్రత పెరుగుతుండగా రాత్రి చలి ప్రభావం కనిపిస్తున్నది. ఈ భిన్న పరిస్థితుల కారణంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల దాక నమోదు అవుతుండగా కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం 14 డిగ్రీల దగ్గరే ఉంటున్నాయి. వారం తరువాత రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావారణ అధికారులు చెబుతున్నారు.