చండూరు, సెప్టెంబర్ 12 : మునుగోడు ఉప ఎన్నికలో తాను గెలిచిన తర్వాత నియోజవర్గానికి రూ.571 కోట్ల నిధులు వచ్చాయని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చండూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా క్లినిక్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ ప్రాంతానికి పట్టిన శని పోయిందని విమర్శించారు. చండూరు పీహెచ్సీ భవనం శిథిలావస్థకు చేరుకున్నందున కొత్త భవనానికి త్వరలోనే నిధులు మంజూరు కానున్నాయని, దాంతోపాటు 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు అవుతుందని ఆయన ప్రకటించారు. సమైక్య పాలనలో ఈ ప్రాంతం ఎంతో వెనుకబాటుకు గురైందని, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నదని చెప్పారు.
చండూరు మున్సిపాలిటీలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. త్వరలో ఆర్డీఓ కార్యాలయం ప్రారంభానికి మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి హాజరవుతారని తెలిపారు. స్థానిక పీహెచ్సీలో ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమానికి ఓ గైనకాలజిస్ట్‌ను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లె కళ్యాణీరవికుమార్, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళా వెంకన్న, కమిషనర్ ఖాజాముజాయుద్దీన్, వైద్యాధికారి డాక్టర్ మాస రాజు, సర్పంచులు నల్ల లింగయ్య, నందికొండ నర్సిరెడ్డి, కుమారి ఇడం రోజా, కౌన్సిలర్లు కోడి వెంకన్న, అన్నపర్తి శేఖర్, తోకల వెంకన్న, కొండ్రెడ్డి యాదయ్య, కో ఆప్షన్ సభ్యులు ముజుబుద్దీన్, వహీద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.