నల్లగొండ, నవంబర్ 20 : అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలని కోరుతూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లేఖ రాశారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత ఆహార సంస్థ (FCI) కొత్త డివిజనల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఇది తెలంగాణ, దక్షిణ ప్రాంతంలో ఎఫ్సీఐ కార్యాచరణ సామర్థ్యం, సేవా పంపిణీని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. లేఖలో 2025-26 ఖరీఫ్ సేకరణలో నల్లగొండ జిల్లాకు కనీసం ఒక లక్ష మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటాను మంజూరు చేయాలని కోరారు. దీని వల్ల సీఎంఆర్ సజావుగా పంపిణీ చేయబడుతుందని వివరించారు.
తీవ్రమైన నిల్వ పరిమితులను పరిగణనలోకి తీసుకుని, ధాన్యాన్ని వేగంగా తరలింపును సులభతరం చేయడానికి నల్లగొండ జిల్లాకు అదనపు రైల్వే వ్యాగన్లను కేటాయించాలన్నారు. తుఫాను సంబంధిత వరి నష్టం నుండి ఉత్పన్నమయ్యే అసాధారణ పరిస్థితుల దృష్ట్యా, సంబంధిత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులను కొన్ని సడలింపులతో సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. నిరంతర సేకరణ కార్యకలాపాలు, రైతులకు సకాలంలో చెల్లింపులు, జిల్లాలో సరఫరా గొలుసు సజావుగా పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం అన్నారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం కొనసాగుతున్న సేకరణ కార్యకలాపాల దృష్ట్యా ఈ విషయంలో వెంటనే స్పందించాలని ఆయన లేఖ ద్వారా కేంద్ర మంత్రిని కోరారు.