నల్లగొండ: రాష్ట్రంలో ప్రతిపక్షాలు తోడేళ్ల మాదిరిగా వ్యవహరిస్తున్నాయని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అధికారంపై పగటి కలలు కంటున్నారని, వారి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సమన్యాయం, స్వచ్ఛ పాలన, సామాజిక న్యాయం ఆధారంగా పాలన సాగుతోందని వెల్లడించారు. శనివారం తన నివాసంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తోడేళ్లలాగా తెలంగాణపై దాడి చేస్తున్నారని, అనైతిక విమర్శలు గుప్పిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, అత్యుత్తమ జీవనప్రమాణాలతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అబద్ధాలతో కాలం వెళ్లబుచ్చుతున్నాయిని ఆరోపించారు.
బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పులు కుప్పగా మార్చిందని, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి, ప్రజల జేబుకు చిల్లు పెట్టారని విమర్శించారు. బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా తెలంగాణలో అమలవుతున్న ఒక్క పథకమైన ఉందా చెప్పాలని సవాలు చేశారు. పేదల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు, అన్ని అంశాల్లో విఫలం అయ్యారన్నారు. కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమయింని విమర్శించారు. ఎస్సీ అసైన్డ్ భూములను తీసుకున్నాని ఒప్పుకున్న ఈటల రాజేందర్‌ను పార్టీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు.