దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 18 : అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే వారే గురువులు అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రదాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేసి విద్యార్థులను గొప్ప పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు జ్ఞాపికలు, శాలువాలు అందజేసి సన్మానించారు.
దేవరకొండ పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 69వ (SGF) స్కూల్ గేమ్ ఫెడరేషన్ దేవరకొండ నియోజకవర్గ స్థాయి అండర్ 14 &17 బాల, బాలికల క్రీడా పోటీలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ నియోజక వర్గంలోని ప్రతి మండలంలో ఒక మినీ స్టేడియం నిర్మాణంపై యోచిస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ పట్టణంలోని జూనియర్ కళాశాలలో మినీ స్టేడియం నిర్మాణం కోసం రూ.2 కోట్లు మంజూరు అయినట్లు, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తాసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓలు డానియల్, వెంకటయ్య, చంద్రమౌళి, ఎంఈఓలు మాతృ నాయక్, నాగేశ్వర్ రావు, గోప్య నాయక్, నర్సింహా, శ్రీనివాస్, అంజయ్య, వెంకటయ్య, బ్రహ్మచారి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు యూనూస్, మాజీ ఎంపీపీ బిక్కు నాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర రాంసింగ్ నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.