నల్లగొండ, డిసెంబర్ 13: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా జరగటం లేదని…ఎన్నికల అధికారులు, పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల అవతారమెత్తి ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన స్థానిక బీఆర్ఎస్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కింది స్థాయి అధికారులు, పోలీసులు ఒక్కటై బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్నా కలెక్టర్, ఎస్పీలు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇతర ప్రాంతాల నుంచి రౌడీ మూకలను రప్పించి బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించటంతో పాటు కిడ్నాప్‌లకు పాల్పడ్డారని…కనీసం నామినేషన్లు కూడ వేయనివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నామినేషన్ వేసిన అభ్యర్థులను కనీసం ప్రచా రం కూడా చేసుకోనివ్వటం లేదన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు రెగ్యులర్‌గా పోలీసులకు, ఎన్నికల అధికారులకు టచ్‌లోకి వెళ్లి వారికి ఆదేశాలిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మొదటి విడత ఎన్నికల్లో మాదిరిగా కాకుండా రెండు, మూడు విడతల్లో పారదర్శకంగా నిర్వహించాలని లేకుంటే జనమే తిరగబడతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సం స్థల ఎన్నికల్లో సరిహద్దుల్లోని సైనికుల మాదిరి పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో ఎన్ని అరాచకాలకు పాల్పడినా ఉమ్మడి జిల్లాలో 40శాతం స్థానాలు సాధించుకున్నామని రెండు, మూడు విడతల్లోనూ బీఆర్ఎస్ వైపే జనం ఉంటారని అన్నారు. 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎలాంటి అరాచకాలకు పాల్పడిందో ప్రస్తుతం కూడా అలాంటి అరాచకాలకే పాల్పడుతోందని, ఆ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదన్నారు.
పదేండ్లు రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే ఈ సారి వందల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి, హత్యలకు పాల్పడినట్లు తెలిపారు. పదేండ్లు మంత్రిగా ఉన్న తాను ఎన్నికల సమయంలో ఏ ఒక్కరోజు కూడా కలెక్టర్లకు, ఎస్పీలకు కనీ సం ఒక్క కాల్ కూడా చేయలేదని..ప్రస్తుతం ఇద్దరు మంత్రులు ప్రతి రోజూ ఫోన్లు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. తొలి దఫా ఎన్నికల్లో నల్లగొండ,నకిరేకల్, సాగర్, తుంగతుర్తి, హుజుర్నగర్ నియోజక వర్గాల్లో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ గెలిచిన ప్రాంతాల్లో రీకౌంటిం గ్ పేరుతో తమ అభ్యర్థులను బయటకు వెళ్లగొట్టి మళ్లీ కౌంటింగ్ చేశామని చెప్పి చివరకు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటిస్తున్నారన్నారు. చినకాపర్తిలో బీఆర్ఎస్కు ఓటు వేసిన బ్యాలెట్ పేపర్లు ఏకంగా మోరీల్లో దొరికాయంటే ఎన్నికల అధికారులు ఏ స్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారో స్పష్టమైందన్నారు. అక్కడ వెంటనే రీ పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ నేతలు తండు సైదులు గౌడ్, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మందడి సైదిరెడ్డి, భోనగిరి దేవేందర్, కందుల లక్ష్మయ్య, బొమ్మరబోయిన నాగార్జున, పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, రావుల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.