నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్9 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు మంగళవారం సంచలన తీర్పును వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి మళ్లీ పేపర్ల వాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిరుద్యోగులతో పాటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు హాజరైన మెజార్టీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్-1పరీక్షకు హాజరైన వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఉన్న విషయం తెలిసిందే. వీరిలోనూ మెజార్టీ అభ్యర్థులు తెలుగు మీడియం వారే కావడంతో హైకోర్టు తీర్పు పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు కొనసాగింపుగా కాంగ్రెస్ సర్కార్ పరీక్షలకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై ఆది నుంచి కాంగ్రెస్ సర్కార్ అనుసరించిన విధానం వివాదాస్పదంగానే ఉంది. అయితే పరీక్షల నిర్వహణ సమయంలోనూ పలు ఆరోపణలు వినిపించాయి.
కొన్ని పరీక్షా కేంద్రాల్లో కొందరు సెలెక్టెడ్ అభ్యర్థులకు ప్రత్యేక స్థానం కల్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఇక ఆ తర్వాత పరీక్ష పేపర్ల ముల్యాంకనం తీరుపైనా సందేహాలు నెలకొన్నాయి. అర్హతలేని వారికి పేపర్ల మూల్యాంకనం అప్పజెప్పారని అప్పట్లోనే కొందరు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీరికి బీఆర్ఎస్ నేతలు అండగా నిలిచారు. పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఇతర ముఖ్య నేతలంతా టీజీపీఎస్పీ ఫలితాలపై స్పందించారు. మంగళవారం హైకోర్టు తుది తీర్పును వెల్లడిస్తూ గతంలో సంజయ్ వర్సెస్ యూపీఎస్సీ కేసులో సుప్రీంకోర్టు వచ్చిన మార్గదర్శకాల ప్రకారం రీవాల్యుయేషన్ చేపట్టాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. అది వీలు కాని పక్షంలో మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందుకోసం 8 నెలల గడువు కూడా విధించింది.
హైకోర్టు తీర్పుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మెజార్టీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థుల్లోనూ మెజార్టీ సంఖ్య గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు గ్రూప్- 1 మెయిన్స్‌కు హాజరయ్యారు. హైకోర్టు తీర్పుతో వీరిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతీ పోటీ పరీక్షలో నల్లగొండ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో పాటీ టీజీపీఎస్పీ రీవాల్యుయేషన్ చేపడుతుందా లేదా మళ్లీ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మొత్తంగా చూస్తే హైకోర్టు తీర్పుపై మెజార్టీ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తుంటే… ప్రభుత్వానికి మాత్రం చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చిందంటూ నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు.