నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన కృషి.. నేడు రైతులకు లాభాలు తెచ్చిపెడుతున్నది. ఆయిల్‌పాం పంటల సాగుతో రైతుల ఆదాయం రెట్టింపవుతుందని, ఒకసారి పంట వేస్తే 30నుంచి 40ఏళ్ల వరకు నెలనెలా ఆదాయం వస్తుందని, ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుందని గత సర్కార్ రైతులను ప్రోత్సహించింది. కేసీఆర్‌ను నమ్మి పంటలు వేసిన రైతులు నేడు వాటి ఫలాలను అనుభవిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2021-22లో ఆయిల్‌పాం సాగును ప్రారంభించిన 120 మంది రైతులు ఇప్పటి వరకు 563టన్నుల గెలలను విక్రయించి రూ.1.15కోట్ల ఆదాయం పొందారు.
– జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ)
చేతికొస్తున్న కేసీఆర్ కలల పంట
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 1472 మంది రైతులు 4,306.74 ఎకరాల్లో ఆయిల్‌పాం పంటలు సాగు చేస్తున్నారు. 2021-22లో జిల్లాలో 120 మంది రైతులు 398 ఎకరాల్లో సాగు చేసిన 563 టన్నుల పంటను ఇప్పటి వరకు విక్రయించి రూ.1. 15కోట్ల ఆదాయం పొందారు. దగ్గరలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ లేకపోవడంతో సువెన్ ఆగ్రో సంస్థ క్వింటాలుకు రూ.20,456 చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసి విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చేసిం ది. త్వరలోనే ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
లాభాలు వస్తుండడంతో మరికొందరు రైతులు ఈ పంట సాగుకు ముందుకొస్తున్నారు. భూపాలపల్లి డివిజన్లోని భూపాలపల్లి, చిట్యాల, గణపురం, మొగుళ్లపల్లి, రేగొండ, టేకుమట్ల మండలాల్లో 2021-22 నుంచి ఇప్పటి వరకు 1207 మంది రైతులు 3,414.44 ఎకరాల్లో, మహదేవ్పూర్ డివిజన్లోని కాటారం, మహదేవ్పూర్, మల్హర్, మహముత్తారం, పలిమెల మండలాల్లో 2021-22 నుంచి ఇప్పటి వరకు 265మంది రైతులు 892.30 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. మొత్తం 1,472 మంది రైతులు 4,306.74 ఎకరాల్లో పంట సాగు చేస్తుండగా 398ఎకరాల్లో దిగుబడి ప్రారంభమైంది. పంట ప్రారంభంలో మొక్కలతో పాటు డ్రిప్‌కు కేసీఆర్ ప్రభుత్వం సబ్సిడీలు అందించి ప్రోత్సహించింది. పంట వేసిన మొదటి సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఎకరానికి రూ.4200 చొప్పున సబ్సిడీ అందించింది.
ఒక్కో మొక్కకు రూ.223 ఉండగా రూ.193 సబ్సిడీ అందించి సువెన్ ఆగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా మొక్కలు పంపిణీ చేసింది. ఒకసారి క్రాప్ ప్రారంభమైతే.., ప్రతి నెలా రైతులు విక్రయించుకునే వీలుంది. ఇలా నిరవధికంగా 30 నుంచి 40 ఏళ్లపాటు నెల నెలా ఆదాయం పొందే అవకాశం ఉంది. ఎకరాకు 5 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం మార్కెట్లో ఆయిల్‌పాంకు రూ. 20,456 ధర ఉందని అధికారులు తెలుపుతున్నారు. మొక్కల మధ్య రైతులు అంతర పంటలు సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఆయిల్‌పాం దిగుబడి ప్రారంభం కావడంతో సువెన్ అగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్యాక్టరీ పనులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఫ్యాక్టరీ పూర్తయితే పెద్దపల్లి, ములుగు, వరంగల్ జిల్లాల రైతులు తమ ఆయిల్‌పాం పంటను ఇక్కడికే తీసుకొచ్చి విక్రయించుకునే వీలుంది.
కేంద్రానికంటే కేసీఆర్ ముందు చూపు
కేంద్రం 2021కి ముందు నేషనల్ మిషన్ ఆఫ్ హెర్బల్ ఆయిల్ ఆధ్వర్యంలో ఆయిల్ పాం సర్వే చేపట్టి ఆమోదయోగ్యమైన భూములను గుర్తించి పంట సాగుకు ప్రోత్సాహకాలు అందించింది. అయితే, అంతకంటే ముందే కేసీఆర్ రాష్ట్రంలో ఈ సాగుపై దృష్టి సారించారు. రైతులకు అవగాహన కల్పించి సాగుకు ప్రోత్సహించారు. దీంతో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకున్నా రైతులు ఆయిల్‌పాం సాగుకు ముందుకొచ్చారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లాలో రైతులు 4,306. 74 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. 120 మంది రైతులు 398 ఎకరాల్లో పంట చేతికి రాగా 563 టన్నులను విక్రయించి రూ. 1.15కోట్ల ఆదాయం పొందారు. ఇప్పు డు ఇంకా సాగుకు ముందుకు వస్తున్నారు. త్వరలోనే చిట్యాల మండలం నైన్‌పాకలో ఫ్యాక్టరీ పనులు ప్రారంభిస్తాం.
– గండ్ర గౌతం రెడ్డి, సువెన్ అగ్రోస్ చైర్మన్
50 టన్నులు అమ్మిన..
మా ఊరిలో నాకున్న పది ఎకరాల భూమిలో ముందుగా ఆరు ఎకరాల్లో నాలుగేళ్ల క్రితం ఆయిల్ పాం పంట వేసిన. అధికారులు చెప్పినట్లు పంటను చూసుకున్న. మధ్యలో కూరగాయలు పండించిన. మూడు నెలల నుంచి ఆయిల్‌పాం గెలలు అమ్ముతున్న. ఇప్పటి వరకు మొత్తం 50టన్నులు అమ్మిన. టన్నుకు రూ.20వేల ధర పలికింది. సుమారు రూ.10 లక్షల వరకు వచ్చినయి. ఇప్పుడు నెలనెలా అమ్ముడే. పంట మంచిగా అనిపించి ఏడాది క్రితం నాకున్న మరో నాలుగు ఎకరాల్లో కూడా ఇదే పంట వేసిన. చాలా సంతోషంగా ఉన్న. ఇతర పంటలకు బదులు ఈ పంట వేస్తే నష్టం లేదు. అప్పుడు కేసీఆర్ చెప్తే ఏమో అనుకున్న. బాగానే ఉంది. – ఆకుల ఎర్ర సమ్మయ్య.
రామచంద్రపురం, చిట్యాల మండలం