టాలీవుడ్‌కు ‘ఒంటరి’గా పరిచయమైంది కేరళ కుట్టి భావన. ‘మహాత్మ’తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. తెలుగులో చేసింది ముచ్చటగా మూడు సినిమాలే అయినా.. ‘టీటౌన్’పై చెరగని ముద్ర వేసింది. టాప్ హీరోయిన్గా ఎదుగుతుందని అనుకుంటున్న సమయంలోనే.. ఊహించని రీతిలో సినిమాలకు దూరమైంది. ఆమె విషయంలో జరిగిన ఓ సంఘటనతో.. దక్షిణాది మొత్తం ఉలిక్కిపడింది. కొద్దికాలం సినిమాలకు విరామం ప్రకటించి.. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నది. మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భావన పాల్గొన్నది.
ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం గురించిన ముచ్చట్లను పంచుకున్నది. తన తొలిచిత్రం ‘నమ్మల్’లో నటనకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకోవడం గొప్ప విజయంగా వర్ణించింది. “ఆ అవార్డు ఎంత ప్రత్యేకమైనదో నాకు అప్పుడు నిజంగా తెలియదు. చిన్న వయసులోనే అంతపెద్ద గుర్తింపు దక్కడం నిజంగా నా అదృష్టం. ఆ అవార్డు వల్లే.. ప్రజలు నన్ను ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. అంత చిన్న వయసులోనే ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమ చూపించారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఇక సినిమా షూటింగ్ కోసమే తన తొలి అంతర్జాతీయ యాత్ర చేపట్టినట్లు వెల్లడించింది. “స్వప్నకూడు చిత్రంలోని ఓ పాట కోసం విదేశాలకు వెళ్లా. స్విట్జర్లాండ్, వియన్నా, ఆస్ట్రియాలలో ఆ పాటను చిత్రీకరించారు. అదే నా తొలి విదేశీ యాత్ర. అప్పటివరకు నేను ఎక్కువదూరం ప్రయాణించిన రికార్డు.. ‘చెన్నై’కి వెళ్లడమే!” అంటూ గుర్తుచేసుకుంది. స్వప్పకూడు సినిమా కూడా ఆ పాటతోనే ప్రారంభమవుతుందని, ఆ సమయంలో అలాంటి ఆలోచన చాలా కొత్తగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఇక తన నటనా జీవితాన్ని ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదని వెల్లడించింది.
“నేను నా కెరీర్‌ను ఎప్పుడూ ప్లాన్ చేసుకోలేదు. నటించడం మొదలుపెట్టాను అంతే! నాకు అప్పుడు పదహారు సంవత్సరాలు కూడా లేవనుకుంటా! 10వ తరగతి పూర్తయిన వెంటనే సినిమాల్లోకి వచ్చాను. నమ్మల్, క్రానిక్ బ్యాచిలర్, స్వప్నకూడు.. ఇలా వరుస ఆఫర్లు వచ్చాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే.. అది ఇప్పటికీ ఒక కలలా అనిపిస్తుంది” అంటూ తన సినీ ప్రయాణంలోని తొలినాళ్ల ముచ్చట్లను పంచుకున్నది. కేరళలోని త్రిస్సూర్‌లో పుట్టిన భావన.. చిన్న వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించి.. నాలుగు రాష్ర్టాల ప్రేక్షకులకు దగ్గరైంది. అతి తక్కువ సమయంలోనే 70కిపైగా సినిమాల్లో నటించింది. ఊహించని పరిణామాలతో సినిమాలకు దూరమైంది. ఇప్పుడిప్పుడే మళ్లీ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. అడపాదడపా సినిమాల్లో నటిస్తున్నది. తన కొత్త చిత్రం ‘అనోమీ’ ఇటీవలే విడుదలైంది.