Murder | జహీరాబాద్, ఏప్రిల్ 1 : ఆస్తి పంపకాల విషయంలో కన్న తండ్రిని దారుణ హత్యకు పాల్పడిన సంఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని భరత్ నగర్ లో బుధవారం చోటుచేసుకుంది. జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్సై వినయ్ కుమార్ ల కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం భూచన్పల్లికి చెందిన తాజుద్దీన్(60) గత కొంతకాలంగా జహీరాబాద్ పట్టణ పరిధిలోని భరత్ నగర్ లోని అద్దె ఇంటిలో భార్య రిజ్వాన, కుమారుడు ఖాజాతో తన సోదరి బిపాషాలు కలిసి నివాసం ఉంటున్నాడు.
బతుకుదెరువు కోసం పట్టణ పరిధిలో కూలి పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. గత కొంతకాలంగా తాజుద్దీన్ తో భార్య రిజ్వానా, కుమారుడు ఖాజా మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజుద్దీన్ను హతమార్చేందుకు ముందుగానే పన్నిన పథకం ప్రకారం అతని భార్య, కుమారుడు కలిసి కళ్లలో కారం చల్లి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దీంతో తాజుద్దీన్ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.
ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్ఐ వినయ్ కుమార్ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తాజుద్దీన్ హత్యకు పాల్పడిన కుమారుడితో పాటు భార్యను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.