సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ఇన్సూరెన్స్‌ల మాయాజాలం ఆర్టీఏ కార్యాలయంలో పేట్రేగిపోతున్నది. ఇన్సూరెన్స్‌ల గడువు, నిబంధనలపై అవగాహన లేకుండానే కొంతమంది ఆర్టీఏ అధికారులు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. అందులోనూ నెల రోజుల ఇన్సూరెన్స్ పేరుతో అధిక సంఖ్యలో వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు కేటాయిస్తున్నారు. మోటార్ వాహనాల నిబంధనల ప్రకారం ఏ వాహనానికి ఫిట్నెస్ కోసం నెల రోజుల ఇన్సూరెన్స్‌ను అనుమతించకూడదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నెల రోజుల ఇన్సూరెన్స్ అంగీకరించొచ్చని ఓ రవాణా శాఖ అధికారి తెలిపారు. కానీ వాస్తవానికి ఫిట్నెస్ కనీసం ఏడాది గడువుగా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో నెల రోజుల ఇన్సూరెన్స్‌ను ఏ నిబంధనల ప్రకారం అంగీకరిస్తున్నారో వారికే తెలియాల్సి ఉంది. నగరంలో అధిక సంఖ్యలో ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఒక నెల ఇన్సూరెన్స్‌తో ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందడం విస్మయానికి గురి చేస్తున్నది. ఇన్సూరెన్స్ నిబంధనలతో సంబంధం లేకుండానే అధికారులు ఆటో, క్యాబ్, ప్రైవేటు బస్సులకు ఫిట్నెస్ డిక్లేర్ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఏజెంట్లు ఫేక్ ఇన్సూరెన్స్లతోనూ కార్యాలయాల్లో పనులు చక్కపెడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఏజెంట్లతోనే రాయబారం..!
మోటార్ వాహన నిబంధనలకు విరుద్ధంగా ఇన్సూరెన్స్‌లు ఉన్నప్పటికీ కొందరు ఎంవీఐలు ఇష్టారాజ్యంగా ఫిట్నెస్లు జారీ చేస్తున్నారు. సాధారణంగా అప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ గడువు చివర్లో ఉన్నప్పటికీ, అది ఫిట్‌నెస్‌కు చెల్లుబాటు కాదు. అందుకే అధికారులు ఫిట్నెస్ కోసం వచ్చే వాహనదారులకు తొలుత ఇన్సూరెన్స్ చేయించుకోవాలని రిజక్ట్ చేస్తారు. కానీ రంగారెడ్డి, మేడ్చల్ ఆర్టీఏ కార్యాలయాల్లో కొంతమంది ఎంవీఐలు ఇన్సూరెన్స్ నిబంధనలను తుంగలో తుక్కి ప్రయాణికుల భద్రతను గాలికొదిలేస్తున్నారు. అందుకోసం కొంతమంది ఏజెంట్లు అలాంటి ఇన్సూరెన్స్‌లతో ఫిట్నెస్లు జారీ అయ్యేలా మంతనాలు జరుపుతున్నారు.
ఒక్క ఫిట్నెస్ ఇన్సూరెన్స్ కోసం రూ.500 నుంచి వెయ్యి వరకు వసూలు చేస్తున్నారని మేడ్చల్ రవాణా శాఖలో ఫిట్నెస్ పొందిన ఓ వాహనదారుడు చెప్పడం గమనార్హం. ఇలా వేలాది వాహనాలకు నగరంలో ఆర్టీఏ కార్యాలయాలు ఫిట్నెస్లు జారీ చేస్తున్నాయి. మోటార్ వాహనాల యాక్ట్‌పై అవగాహన ఉండాల్సిన అధికారులు నిబంధనలకు తూట్లు పొడుస్తుండటంతో ట్రాన్స్పోర్ట్ వాహనదారులు సైతం అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి సర్టిఫికెట్ పొందుతున్నారు. కనీసం 3-6 నెలల గడువు ఉంటే మాత్రమే ఫిట్నెస్ జారీచేయాల్సి ఉంటుందని ఓ రవాణా శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వాల్యుడ్ ఇన్సూరెన్స్, పర్మిట్, ట్యాక్స్, పీయూసీలను పరిశీలించి రవాణా శాఖ అధికారులు అనుమతివ్వాల్సి ఉంటుందనే విషయం తెలిసిందే.
అవగాహన లోపం
సాధారణంగా ఇన్సూరెన్స్ లేకుంటే ఎక్కువ నష్టపోయేది వాహన యజమానే. కానీ కొందరు నిర్లక్ష్యంతో ప్రమాదమేమీ జరగదులే అని ఇన్సూరెన్స్‌లు తీసుకోవడం లేదు. వేల రూపాయలతో ఇన్సూరెన్స్ తీసుకునే బదులు రూ1000 లోపు పనౌతుంది కదా అని దాటవేస్తున్నారు. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే నేరంగా భావిస్తారు. మొదటిసారి పట్టుబడితే రూ.2వేల జరిమానా, రెండోసారి అయితే రూ.4వేల జరిమానా ఉంటుంది. వాహనాలు సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని ఏజెన్సీలు నకిలీ ఇన్సూరెన్స్‌లను సృష్టించి ఏజెంట్లతో పనులు పూర్తి చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అధికారులు ఈ డాక్యుమెంట్లను సరిగా పరిశీలించకుండానే ఫిట్నెస్లు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.