యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఎండలు ముదరనే లేదు. అప్పుడే యాదాద్రి భువనగిరి జిల్లాలో తాగునీటికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు. రిజర్వాయర్ల నుంచి జిల్లాకు వచ్చే జలాలు సగానికి పడిపోయాయి. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు వట్టిపోయాయి. పల్లెలు, పట్టణాల్లో ప్రజలకు కష్టాలు షురూ అయ్యాయి. అనేక గ్రామాలు, పట్టణాల్లో వారానికి రెండు సార్లు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో కొన్ని చోట్ల ట్యాంకర్లే దిక్కయ్యాయి.
యాదాద్రి జిల్లావాసులకు వేసవిలో నీటి కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. నిత్యావసరాల కోసం వాడుకునే తాగునీటికి అప్పుడే కొరత ఏర్పడుతున్నది. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు, 427 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు హైదరాబాద్ మెట్రో వాటర్ గ్రిడ్ నుంచి మిషన్ భగీరథ నుంచి నీరు సరఫరా అవుతున్నది. ఆయా గ్రామాల్లో ప్రజల కోసం రోజుకు 70 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) నీరు అవసరం. కానీ ప్రస్తుతం సగం ఎంఎల్డీలు మాత్రమే జిల్లాకు వస్తున్నాయి. ఇక చౌటుప్పల్, నారాయణపురం, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ మండలాల్లోని గ్రామాలకు నల్లగొండ జిల్లాలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి జలాలను సరఫరా చేస్తున్నారు. రామన్నపేట, మోత్కూర్, అడ్డగూడూర్ మండలాలకు పానగల్ రిజర్వాయర్ నుంచి కృష్ణానీటిని అందిస్తున్నారు. మొత్తంగా జిల్లాకు 89 ఎంఎల్డీలు అవసరం కాగా.. ప్రస్తుతం 54 ఎంఎల్డీల నీరు మాత్రమే సరఫరా అవుతున్నది. దీంతో ప్రజలకు పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు.
పట్టణాలు, గ్రామాల్లో సరిపడా నీళ్లు లేకపోకపోవడంతో మిషన్ భగీరథ నీళ్లలోనే స్థానిక బోరు నీళ్లను కలిపి సరఫరా చేస్తున్నారు. అది కూడా చాలా చోట్ల వారానికి రెండు సార్లు మాత్రమే అందిస్తున్నారు. కొన్ని చోట్ల నీటి సరఫరా లేకపోవడంతో వాటర్ ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. కాలనీల్లో ట్యాంకర్ల నుంచి పట్టుకొని డ్రమ్ముల్లో నింపుకొంటున్నారు. భువనగిరి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, నందగుట్ట ప్రాంతాలతోపాటు పలు వార్డుల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీలో రెండు వాటర్ ట్యాంక్‌లు ఉన్నప్పటికీ నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. బస్వాపూర్ ముంపు గ్రామం తిమ్మాపూర్ కాలనీలో ఇప్పటికీ నీటి సరఫరా జరగలేదు. కొత్త ఇంటి నిర్మాణాలకు రూ. వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. ఇంట్లో అవసరాలకు అనేక మంది ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ రూ.500 వరకు చెల్లిస్తున్నారు. ఇక్క ట్యాంకర్ల నిర్మాణం, నీటి సదుపాయం ఉన్నా సరఫరా మాత్రం చేయడం లేదు. చౌటుప్పల్ మున్సిపాలిటీ శివారు ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. యాదగిరిగుట్టలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక కొన్ని గ్రామాల్లో నీళ్లు లేక బోరింగ్లు, వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. అక్కడికే వెళ్లి బట్టలను ఉతుక్కుంటున్నారు. గ్రామాలు, తండాల్లో కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి.
మిషన్ భగీరథ నీళ్లు సరిగా రాకపోవడంతో తాగు నీటి కోసం జనం వాటర్ ప్లాంట్లకు క్యూ కడుతున్నారు. వాటర్ ప్లాంట్లలో నీటిని కొనుగోలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. ఫిల్టర్ వాటర్ కోసం ఒక్కో కుటుంబం నెలకు రూ.400 నుంచి రూ.500 ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీంతో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులకు పంట పండుతున్నది. ఇంకొందరు ఇంట్లోకి వాటర్ ఫిల్టర్లను కొనుగోలు చేసుకుంటున్నారు. గతేడాది 67 ఆవాసాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. ఈ సారి 90 ఆవాసాలు, మున్సిపాలిటీల్లోని 30వార్డుల్లో నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.