యాసంగి సీజన్లో తుంగతుర్తి నియోజకవర్గంలో 70శాతం పంటలు నష్టపోయిన రైతాంగం మిగిలిన కొద్దిపాటి పొలాలైనా కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నది. ఇప్పటికే వేల ఎకరాలు పశువులు, గొర్రెలకు మేతగా మారిన సంగతి తెలిసిందే. మిగిలిన పంటలు పొట్టదశలో ఉండగా ఒక్క తడి నీళ్ల కోసం రైతులు తండ్లాడున్నారు. వారంపాటు నీళ్లు అందిందే వరి పైర్లు చేతికి వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం నీటి విడుదల బంద్ పెట్టడం, బోర్లు సరిగ్గా పోయకపోవడంతో చివరి దశలో పంటలను కాపాడుకునేందుకు శతివిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఎస్పారెస్సీ కాల్వలకు వారబందీలో ఆరు విడుతల నీళ్లు ఇస్తామన్న ప్రభుత్వం షెడ్యూల్ పూర్తయ్యిందంటూ మార్చి 24తో నీటి విడుదలను బంద్ చేసింది. వాస్తవానికి మొదటి నుంచి కూడా ఎన్నడూ పూర్తిస్థాయిలో రైతులకు నీళ్లు అందడం లేదు. ప్రధాన కాల్వల్లోనూ పిల్ల కాల్వల కంటే దారుణంగా నీళ్లు పారాయి. ఇప్పుడు మొత్తానికే బంద్ పెట్టడంతో పొట్టదశలో ఉన్న పంటలు ప్రశ్నార్థకంగా మారాయి. సాగు నీరు లేకపోవడం, చెరువులు నింపకపోవడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు వట్టిపోయిన సంగతి తెలిసిందే. ఎక్కడైనా కొద్దొగొప్పో నీళ్లు ఉన్నా ఆగిఆగి పోస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పంటలను కాపాడుకునేందుకు పలుచోట్ల రైతులు ట్యాంకర్లతో నీళ్లు కొనుగోలు చేసి తడులు అందిస్తున్నారు.
బీఆర్ఎస్ సర్కారులో వచ్చినట్టే సాగు నీరు అందుతుందని భావించిన రైతులు యాసంగిలో తుంగతుర్తి నియోజకవర్గవ్యాప్తంగా 54,721 ఎకరాల్లో వరి సాగు చేశారు. తిరుమలగిరి మండలంలో 3,360 ఎకరాలు, నాగారంలో 8 వేలు, జాజిరెడ్డిగూడెంలో 16 వేలు, తుంగతుర్తిలో 14,208, నూతనకల్‌లో 4,500, మద్దిరాల మండలంలో 8,653 ఎకరాల్లో వరి పెట్టారు. కాగా, సాగు నీరు అందక ఇప్పటికే 70 శాతం పంటలు ఎండిపోయాయి. ఫిబ్రవరిలో ఆలస్యంగా నాటు వేసిన పొలాలు ప్రస్తుతం పొట్టదశలో ఉన్నాయి. ప్రభుత్వం ఒక్క తడికి నీళ్లు ఇచ్చినా ఎంతోకొంత పంట చేతికి వస్తుందని రైతులు వేడుకుంటున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటి వరకు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో దుర్భర పరిస్థితులు ఉండేవి. ఎటుచూసినా బీడు భూములు. నెర్రెలు బారిన చెరువులు, కుంటలే. 300 వందల ఫీట్ల బోర్లు తవ్వినా నీటి జాడ దొరికేది కాదు. అప్పులు, పస్తులు, రైతు ఆత్మహత్యలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు ఉండేవి. వలస బాటలో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అయ్యేవి.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా పరిస్థితులను చక్కదిద్ది ఏడాదిలో రెండు పంటలకు కాళేశ్వరం జలాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా సాగునీరు ఇవ్వడంతోపాటు చెరువులు నింపడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. 30 ఫీట్లు బోరు తవ్విస్తే నీళ్లు ఉబికి వచ్చేవి. దానికి రైతుబంధు, 24గంటల నిరంతర విద్యుత్ ఇవ్వడంతో రైతులు పుష్కలంగా పంటలు పండించి ఆర్ధికంగా కొంత నిలదొక్కుకున్నారు. వలసలు వెళ్లిన వారు సైతం వాపస్ వచ్చి ఉన్నభూమిని బాగు చేసుకుని పంటలు పండించుకున్నారు. మళ్లీ ఇప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి రోజులు వస్తాయనుకోలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాకున్న రెండెకరాల్లో వరి నాటు పెడితే.. నీళ్లు లేక ఎకరం ఎండింది. పశువుల మేతకు వదిలిపెట్టిన. బోరు ఆగిఆగి పోస్తున్నది. మిగిలిన ఎకరంలో కొద్దోగొప్పో పంట చేతికి వస్తుందని ఆశతో పైపులు వేసుకుని వరుస తడులు వేస్తున్నా చివరి మడికి నీరు చేరుతలేదు. కరెంట్ వచ్చి పోతుండే సరికి పారిన మడే పారుతున్నది. కేసీఆర్ గవర్నమెంట్లో కాల్వల్లో ఎప్పుడూ నీళ్లు ఉండేవి. చెరువులు, కుంటలు నిండి బోర్లు నిండుగా పోసేవి. ఇప్పటి ప్రభుత్వం కాల్వలకు సక్కగ నీళ్లు ఇవ్వకపోయేసరికి బోర్లు ఎండిపోయినయి. ఇప్పటికే 70 వేలకు పైగా పెట్టుబడి పెట్టిన. పెట్టుబడి కూడా వెళ్లదు.
-కాలురాం, రైతు, తిరుమలగిరి
నేను మూడెకరాల్లో వరి, అరెకరంలో కూరగాయల తోట పెట్టిన. రెండున్నర ఎకరాల్లో వరితోపాటు కూరగాయల తోట కూడా ఎండింది. ఒక అరెకరంలో వచ్చి కొంత చేతికి వచ్చేట్లు ఉంటే పైపులు వేసి తడులు కడుతున్నా. నీళ్లు చాలడం లేదు. రెండు లక్షలకు పైగా పెట్టుబడి పెట్టిన. ప్రభుత్వం ఎండిన పంటలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
-దేవేందర్, రైతు, తిరుమలగిరి