మోత్కూరు, ఏప్రిల్14 : రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి తూట్లు పొడిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని సోమవారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కిశోర్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ రిజర్వేషన్ల ద్వారా ఎంతో మందికి చట్ట సభల్లో మాట్లాడే అవకాశం వచ్చిందన్నారు. ఉద్యమ నేత కేసీఆర్ రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారంగా రాష్ర్టాన్ని ఏర్పాటు చేసుకోవచ్చునని తెలుసుకొని ఉద్యమ పార్టీని స్థాపించి పార్లమెంటరీ పంథాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ర్టాన్ని సాధించారని తెలిపారు.
పది సంవత్సరాలు నిర్విరామంగా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడిన ఘనత కేసీఆర్‌కు దక్కిందని చెప్పారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని అటకెక్కించిందని, హైదరాబాద్‌లో 125ఫీట్ల ఎత్తులో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి కనీసం గౌరవం కల్పించకుండా వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దుర్మార్గమైన పాలన ఎక్కడా లేదని, ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు ఈడ్చి కక్ష తీర్చుకుంటున్నదని మండిపడ్డారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు పొన్నెబోయిన రమేశ్, జంగ శ్రీను, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్రనాథ్, కొణతం యాకూబ్‌రెడ్డి, నాయకులు రాంపాక నాగయ్య, సోంమల్లు, బయ్యని పిచ్చయ్య, గజ్జి మల్లేశ్, మర్రి అనిల్, తొట్ల స్వామి, శైలజ, ఇంద్రజ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొని బాబా సాహెబ్ చిత్రపటాలు, విగ్రహాలకు నివాళులర్పించారు.