మిర్యాలగూడ, నవంబర్ 8: కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 15 రోజులవుతున్నా ఇంతవరకు ధా న్యం కొనుగోళ్లు (Paddy Procurement) ప్రారంభించలేదు. అయినప్పటికీ ఇద్దరు రైతులు అధికార పార్టీ నాయకుల అండదండలతో పచ్చి ధాన్యాన్ని నేరుగా పట్టణ పరిధిలోని శ్రీశివసాయి రైస్ ఇండస్ట్రీస్‌కు తరలించినట్లు ట్రక్‌షీట్ ఇచ్చారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500 అందిస్తున్న బోనస్‌ను కాజేసేందుకు ఇద్దరు అధికార పార్టీకి చెందిన నాయకులు తమ పొలంలో పోసిన ధాన్యాన్ని పీఏసీఎస్ కేంద్రంలో పోసినట్లు, దాన్ని కాంటా వేసి సంబంధిత రైసుమిల్లుకు తరలించినట్లు పీఏసీఎస్ సీఈవో, వ్యవసాయశాఖ ఏఈవో అండతో ట్రక్షీట్లు తయారు చేయించారు. కాగా పీఏసీఎస్‌లో ఇంతవరకూ ధాన్యం కొనుగోళ్లే చేపట్టలేదని అధికారులు పేర్కొన్నారు.
మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి సైదిరెడ్డి 104 క్వింటాళ్లు (సన్న ధాన్యం), త్రిపురారం మండలానికి చెందిన ధనావత్ తులస్యా 192 క్వింటాళ్ల ధాన్యాన్ని అవంతీపురం-1 పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో విక్రయించినట్లుగా అధికారుల అండతో ట్రక్ షీట్ సృష్టించారు. అధికారులు, రాజకీయ నాయకుల అండతో ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్‌ను కాజేసేందుకు నాణ్యత లేని ధాన్యాన్ని నేరుగా మిల్లుకు తరలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు ఎగుమతి చేసినట్లు సంబంధిత రైతులు ట్రక్‌షీట్ కూడా అందజేశారు.
ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పేద రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయని అధికారులు, పలుకుబడి ఉన్న రైతుల ధాన్యాన్ని నాణ్యత లేకున్నా, కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోయకున్నా ట్రక్ షీట్ సృష్టించి ప్రభుత్వం ఇస్తున్న బోనస్ కాజేస్తున్నారు. ఈ విషయంపై పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం ఆరబెట్టుకుంటున్న రైతులు మాట్లాడుతూ తమను పట్టించుకోకుండా పలుకుబడి ఉన్నవారి ధాన్యం అడ్డదారిలో మిల్లుకు తరలించి తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డదారిలో ట్రక్‌షీట్ సృష్టించిన పీఏసీఎస్, వ్యవసాయ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.