దేవరకొండ, ఏప్రిల్ 11 : దేవరకొండ మండలంలోని కొండభీమనపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు మధ్యవర్తుల చేతిలో నష్ట పోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.