మిర్యాలగూడ, నవంబర్ 13 : అన్నదాతలు అరిగోస పడి పండించిన పంటలను అమ్ముకునేందుకు మిల్ పాయింట్ల వద్దకు వెళ్తే వ్యాపారులు అడిగిన ధరకే ధాన్యం తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ వానకాలం కోతలు ప్రారంభమైన నాటి నుంచి సన్న ధాన్యాన్ని రైస్ మిల్లు వ్యాపారులు రూ.2500 నుంచి రూ.2650 వరకు కొనుగోలు చేశారు. మిల్లుల వద్దకు ధాన్యం అధికంగా రావడం ప్రారంభం కావడంతో రైస్ మిల్లర్లు సిండికేట్గా మారి రూ.2450లోపే సన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్, నల్లగొండ నియోజకవర్గాల నుంచి ధాన్యం మిర్యాలగూడ మిల్లుల వద్దకు వస్తుంది. సన్న ధాన్యం అధికంగా రావడంతో మిల్లర్లంతా కూర్చొని పోటీపడి ధాన్యం కొనుగోలు చేసి రేట్లు పెంచవద్దని నిర్ణయించారు.
మిర్యాలగూడ, నాగార్జునసాగర్, సూర్యాపేట, నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి సన్నధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు మిర్యాలగూడ పరిసర ప్రాంతాల మిల్లుల వద్దకు వస్తున్నారు. వారం రోజుల క్రితం సన్న ధాన్యానికి క్వింటాకు గరిష్టంగా రూ.2650 వరకు చెల్లించారు. ఈ ధరను రూ.2550కి చేశారు. మరోసారి మిల్లర్లంతా సిండికేట్గా మారి ఇలాగైతే కుదరదు రూ.2450 ఎవరూ కూడా ఎక్కువ పెట్టకూడదని నిర్ణయించారు. ఒకేసారి రూ.200 ధరను తగ్గించారు. రైతులు ఒకేసారి ఇంత ధర ఎందుకు తగ్గించారని అడిగితే ఇష్టముంటే అమ్ము లేకపోతే వెళ్లిపో అని వ్యాపారులు బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు రూ.6వేల వరకు నడుస్తున్నాయి. బియ్యం ధరలు అధికంగా ఉన్నా కూడా వ్యాపారులు అన్నదాతలకు సన్న ధాన్యానికి గిట్టుబాటు ధర అందించే పరిస్థితి లేకుండా సిండికేటై ధరను అమాంతం తగ్గించారు.
వానకాలంలో రైతులు పంటల సాగుకు చాలా కష్టపడ్డారు. ఒకవైపు ఎరువులు సమయానికి దొరకక అవస్థలు పడ్డారు. యూరియా కోసం రోజుల తరబడి పీఏసీఎస్ కార్యాలయాల చుట్టు తిరిగి అలసిపోయారు. ఈ దశలో వరి పొలాన్ని కోత దశ దాకా తీసుకొచ్చాక తుఫాన్ రూపంలో రైతులను కబళించింది. కోతకు వచ్చిన వరి పొలాలు పూర్తిగా నేలవాలడం వల్ల పదిశాతం గింజలు దెబ్బతిన్నాయి. ఇవి కోత దశలో రాలిపోవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది. కోత మిషన్ సాధారణంగా ఒక గంటలకు ఎకరం పొలం కోస్తుంది. పంట పొలాలు పడిపోవడం వల్ల ఒక ఎకరం పొలాన్ని మూడు గంటలకు పైగా కోయడం వల్ల రైతులకు ఎకరాకు రూ.9వేల వరకు ఖర్చు వస్తుంది. ఈ దశలో రైస్ మిల్లర్లు ధరలను ఒకేసారి తగ్గించడంతో రైతులు విలవిలలాడిపోతున్నారు. బహిరంగ మార్కెట్లో సన్న ధాన్యానికి మంచి ధరలు ఉన్నా కూడా రైస్ మిల్లు వ్యాపారులు ధరలు తగ్గించడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హెచ్ఎంటీ రకం సన్నధాన్యానికి రూ.2200 నుంచి రూ.2300 వరకు మాత్రమే చెల్లించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైస్ మిల్లర్లు అడిగిన ధరలకే ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. సివిల్ సప్లయ్ అధికారులు ధాన్యం కొనుగోళ్లపై పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైస్ మిల్లర్లు ఇష్టారాజ్యంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఐదు ఎకరాల పొలంలో పండించిన హెచ్ఎంటీ ధాన్యాన్ని రైస్ మిల్లులో అమ్మేందుకు వెళ్తే రూ.2350 మాత్రమే ధర చెల్లించారు. మద్దతు ధర ఇవ్వమంటే నీ ఇష్టం ఉంటే అమ్ముకో లేకపోతే వెళ్లు అని అంటున్నారు. దీంతో పచ్చి ధాన్యం ఖరాబు అవుతుందనే ఉద్దేశంతో వాళ్లు అడిగిన ధరకే అమ్ముకొని వెళ్లాను. రైతులకు గిట్టుబాటు ధర అందించే విధంగా ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టాలి. – సైదులు, రైతు, మిర్యాలగూడ