యాదాద్రి భువనగిరి, జూన్ 20 (నమస్తే తెలంగాణ) : కేంద్రం నిర్దేశించిన లక్ష్యం మేరకే ధాన్యం కొంటామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుతో మళ్లీ రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి దాపురిస్తోందన్నారు. శనివారం భువనగిరిలో బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోందని, రైతుల కన్నీళ్లలో కాంగ్రెస్ సరారు కొట్టుకుపోతుందన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంపై ప్రతిపక్షాలన్నీ ఢిల్లీ వెళ్లి కేంద్రం మెడలు వంచి.. ధాన్యం కొనేలా ఒప్పించాలన్నారు. లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని రామకృష్ణా రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వం కొత్త పథకాలు అమలు చేయకపోగా.. పాత పథకాలకు పాతరేస్తున్నదని రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు.
2014 కంటే ముందు తెలంగాణలో 1.30 కోట్ల ఎకరాల్లో సాగు జరిగేదని, 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి 2.34 కోట్ల ఎకరాల్లో సాగు అయ్యిందని, పదేండ్లలో కోటి ఎకరాలకు అదనంగా కేసీఆర్ సాగు నీరు అందించారని గుర్తు చేశారు. వరి సాగులో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారన్నారు. కాంగ్రెస్ పాలనలో అదనంగా ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఉచిత కరెంట్ సరఫరా చేయలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఇప్పుడు రైతు ఆరుగాలం కష్టించి పండించిన పంట కూడా కొనబోమని చెప్పడం సరార్ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఆరుద్ర కార్తె ప్రవేశించినా ఇప్పటికీ 20 నుంచి 25శాతం వడ్లు కల్లాల్లోనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎన్నడూ యూరియా కొరత రాలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ను తిట్టడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని విమర్శించారు. సరార్ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బూతులతో డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం హోదాలో ఉండి అడ్డగోలుగా వాగుతున్నారని కంచర్ల మండిపడ్డారు. రైతు బంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్ మాట్లాడుతూ.. యూరియా యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్ఎస్ నేతలు మొగుళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.