గరిడేపల్లి, అక్టోబర్ 19 : మండలంలోని రంగాపురం ప్రాథమిక పాఠశాలకు విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ప్రభుత్వ ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త చారగుండ్ల రాజశేఖర్ కృషి చేస్తున్నారు. రంగాపురంలో జంగాల కులానికి చెందిన 70 కుటుంబాలు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు నిజామాబాద్, శంషాబాద్, చిట్యాల, చల్లాగరిగె, బెంగు తండా, నల్లగొండ, రామకృష్ణాపురం పట్టణాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నర్సారావుపేట, దాచేపల్లి, విజయవాడ, విస్సన్నపేటకు కూలీ పనుల నిమిత్తం వెళ్తున్నారు. వారి కుటుంబాల్లో తాతలు, తల్లిదండ్రుల నుంచి ఎవరూ ఉద్యోగాలు చేసిన, చేస్తున్న దాఖలాలు లేవు. ఉన్నత చదువులు చదివిన వారి సంఖ్య చాలా తక్కువ.
అయితే చదువే ఆయుధం అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మాటలను ఉపాధ్యాయుడు చారగుండ్ల రాజశేఖర్ వారికి వివరిస్తున్నారు. పేదరికం, చంటి పిల్లల సంరక్షణ తదితర కారణాలతో చదువుకోకపోతే జరిగే నష్టంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపేలా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. హెచ్ఎం రామిశెట్టి లక్ష్మయ్య సహకారంతో విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు. ప్రభుత్వ బడుల బలోపేతంతో పాటు పేద విద్యార్థులకు చదువు చెబుతూ… వారి ఆలనాపాలనా చూస్తున్న ఉపాధ్యాయుడు చారగుండ్ల రాజశేఖర్‌ను పలువురు అభినందిస్తున్నారు.