ఈ యాసంగి సీజన్లో అనేక కష్టనష్టాలకు ఓర్చి సన్న రకం వరి సాగు చేసిన రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద 3.30లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. అందులో అత్యధికంగా 2.25లక్షల ఎకరాల్లో వివిధ రకాల సన్నరకం హైబ్రిడ్ వంగడాలనే నాటు పెట్టారు. ఆయా వంగడాలు 90 నుంచి 100 రోజుల్లోనే చేతికి వచ్చేవి అవడంతో కోతలు కూడా మొదలయ్యాయి.
సీజన్ ప్రారంభంలో వాతావరణ మార్పులతో వరి పెరగకుండానే పొట్ట దశకు వచ్చి ఈనడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు వ్యవసాయాధికారుల సూచనలతో సాధారణంగా యాసంగిలో రెండు సార్లు మాత్రమే యూరియా వేసే రైతులు ఈసారి మూడు నాలుగు సార్లు చల్లాల్సి వచ్చింది. ఇలాంటి ఆటుపోట్లను తట్టుకుని ఎకరాకు 35 నుంచి 45 బస్తాల వరకు దిగుబడి తీస్తున్నా మార్కెట్లో రైతులకు సంతోషం లేకుండా పోతున్నది.
ఐకేపీ కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320తోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్‌ను ఇస్తుంది. ఈ లెక్కన సన్నధాన్యం విక్రయించుకున్న రైతులకు క్వింటాకు రూ.2,820 దక్కుతుంది. కానీ, వరి కోతలు ఊపందుకున్నా ప్రభుత్వం ఇంకా సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయలేదు. దాంతో మిల్లర్లు డిందే ఆటగా మారింది. వారం రోజుల్లో రెండు రూపాయల ధర తగ్గించినా పట్టించుకునే వారు లేదని రైతులు వాపోతున్నారు.ఒకవైపు పెట్టుబడులు పెరిగి వ్యవసాయం భారంగా మారిందని, తీరా పంట చేతికి వచ్చా వ్యాపారులు దోచుకుంటున్నారని మదన పడుతున్నారు.
మిర్యాలగూడలోని రైస్ మిల్లులకు నిత్యం వందల ట్రాక్టర్ల ధాన్యం వస్తున్నది. మిలర్లు పంట నాణ్యతకు తగిన ధర ఇవ్వకుండా ఇబ్బందుకు గురి చేస్తున్నా పౌర సరఫరాలు, వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులెరూ స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదు చేద్దామని ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరి కోతలు ఊపందుకున్నా ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దాంతో రైతులు నేరుగా ధాన్యం కోసి ట్రాక్టర్ బోరెంల్లో మిర్యాలగూడ రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. ఇక్కడి సిండికేట్ అయిన మిల్లర్లు ధర తగ్గిస్తూ రైతులను దోచుకుంటున్నారు. వారం క్రితం వరకూ మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోని మిల్లుల్లో క్వింటాకు రూ.2,400 నుంచి రూ.2,500 వరకు ధర పెట్టి కొనుగోలు చేశారు.
ఈ వారం కోతలు ముమ్మరం అవడంతో మిర్యాలగూడతోపాటు నాగార్జునసాగర్, హుజూర్నగర్, నకిరేకల్, నల్లగొండ, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి ధాన్యం లోడ్లు వస్తున్నాయి. ఇదే అదనుగా భావించిన మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి పచ్చి వడ్లు కావడంతో పచ్చగింజ కనపడుతుందని సాకుగా చూపి ధరను అమాంతం తగ్గించారు. ఇప్పుడు క్వింటాకు రూ.2,200 నుంచి రూ.2,300 వరకు ఇస్తున్నారు. ఆ రేటుకు అయితేనే కొంటాం.. లేదంటే మీ ఇష్టమని తేల్చి చెప్తుండడంతో ధాన్యం లోడ్‌తో వచ్చిన రైతులు వెనుదిరిగి వెళ్లక విధిలేని పరిస్థితుల్లో అమ్ముకుంటున్నారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు మిల్లుల వద్ద ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు సిండికేట్ అయ్యి రైతులను దోచుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ అసలే ఉండడం లేదు. కొనుగోలు పూర్తయ్యే వరకు ప్రభుత్వం శ్రద్ధ పెట్టి రైతులకు న్యాయం చేయాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తే మిల్లర్లు కూడా ధాన్యం రేటు పెంచే అవకాశం ఉంది.
-యరెడ్ల సత్యనారాయణరెడ్డి పీఏసీఎస్ చైర్మన్, పాలకవీడు