హుజూర్నగర్, మే 15 : రాష్ట్రంలోని పేదలందరికీ కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో రూ.1.25కోట్లతో చేపడుతున్న డయాలసిస్, బ్లడ్ స్టోరేజీ సెంటర్ నూతన భవనానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే వారం హుజూర్‌నగర్‌లో బస్తీ దవాఖానల ప్రారంభోత్సవానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు రానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 6లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని పేర్కొన్నారు.
కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఎర్ర తివాచీ పరిచిందన్నారు. పల్లె నుంచి పట్టణం దాకా ఉద్యమంలా అభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. రూ.3500 కోట్లతో నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో సైతం ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణలో ఉండదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు పార్వతి, గూడెపు శ్రీను, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనారవి, కౌన్సిలర్ గాయత్రీభాస్కర్, బీఆర్ఎస్ నాయకులు అమర్నాథ్రెడ్డి, అమర్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ కరణ్‌కుమార్, డాక్టర్లు ప్రవీణ్‌కుమార్, నక్క రవికుమార్ పాల్గొన్నారు.