నల్లగొండ, అక్టోబర్ 23 : వర్షాలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా దళారులను ప్రోత్సహిస్తుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో గల పత్తి చేనులను ఆయన పరిశీలించారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పత్తి సీజన్ వచ్చినా రాష్ట్రంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎందుకు ప్రారంభించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. వర్షాల కారణంగా పత్తిని స్టాక్ పెట్టుకోలేక రైతులు సతమతం అవుతున్నట్లు తెలిపారు.
దళారుల చేతుల్లోకి రైతులను నెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు లాభం కలిగేలా పంటలకు సరైన మద్దతు ధర ఇచ్చి సమయానుకూలంగా కొనుగోలుకు చర్యలు చేపట్టేవారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందుల్లోకి నెట్టి రైతులను బాధలు పెడుతుందని దుయ్యబట్టారు. తెలంగాణ నుండి కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మీద విమర్శలు చేయడం తప్పా ప్రజలకు ఇంత వరకు ఏం చేశారో చెప్పాలన్నారు. రైతు సంక్షేమం జాడలేదు, వడ్ల బోనస్ ఊసు లేదు, పండిన పంటను కొనుగోలు చేసే దిక్కే లేదు, సకాలంలో ఎరువులు ఇవ్వడం చేతకాదు, మద్దతు ధర ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదన్నారు. ఇప్పటికైనా రైతులను ఇబ్బందులు పెట్టకుండా, ఆంక్షలు లేకుండా పత్తి కొనుగోళ్లు చేసి మద్దతు ధర ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున తాము డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కల్లూరి మల్లారెడ్డి, రుద్రారం భిక్షపతి, బాలగొని రాజు, కొలను వెంకటేశ్, రమణారెడ్డి, మర్రి జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.