కోదాడ, ఏప్రిల్ 23 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పొట్టలు కొట్టి వారి సమస్యలు పరిష్కరించకుండా తాత్సారం చేస్తుందని, ఈ సంస్థను క్రమేణ ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం కోదాడ డిపో ఆవరణలో ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించాలని రెండున్నర సంవత్సరాలుగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి పలు రూపాలలో విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేకపోవడం వల్లే కార్మికులు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమ్మెపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీనే నిలబెట్టుకోవాలని కార్మికులు సమ్మె చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ప్రాథమిక అవగాహన లేని డ్రైవర్లతో బస్సులు నడపడం వల్ల ప్రయాణికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. గతంలో ప్రతి చిన్న సమస్యపై మాట్లాడిన కోదండరాం లాంటి మేధావులు ఆర్టీసీ సమ్మెపై ఎందుకు నోరు మెదపడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఆర్టీసీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన రూ.200 కోట్ల చెక్కు ఇప్పటికీ చెల్లలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలోని బస్సులను ఇప్పటి ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తున్నారని అపహస్యం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దాకా సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
ఆర్టీసీ అధికారులు సమ్మెను నీరు కార్చేందుకు పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దింపడం, కార్మికులపై ఒత్తిడి తేవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే నయీమ్, నాయకులు కుక్కడపు బాబు, సుంకర అజయ్ కుమార్, తోగరు రమేష్, ఉపేందర్ గౌడ్, కరీముల్లా, గొర్రె రాజేష్, చలిగంటి వెంకట్, పిట్టల భాగ్యమ్మ, ఉపేందర్ గౌడ్, జానీ అబ్దుల్లా, పుల్లయ్య, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. కాగా డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ధర్నా నిర్వహించారు.

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం కుట్ర : మాజీ ఎమ్మెల్యే బొల్లం