హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ ఒకటి నుంచి కేవలం ‘టీ-ఫైబర్’ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో టీ-ఫైబర్పై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఆ గడువు దాటిన తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవల నిమిత్తం ప్రైవేట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దని స్పష్టం చేశారు.
టీ-ఫైబర్ నెట్ వర్ వినియోగం ద్వారా ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశముందని వెల్లడించారు. ఇంట్రానెట్ బేసిస్లో సెక్యూర్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ కల్పించడం ద్వారా రాష్ట్ర డాటా సెంటర్కు అనుసంధానం ఏర్పడి, పూర్తి స్థాయి డాటా సెక్యూరిటీ చేకూరుతుందని వెల్లడించారు. గత ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు ‘టీ-ఫైబర్’ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.