హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారించాలన్న డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. మొత్తం నాలుగు దశల్లో ఉద్యమించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. ఆగస్టు 29న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీ వెల్లడించింది. అయినా సర్కార్ స్పందించకపోతే సెప్టెంబర్‌లో ‘చలో అసెంబ్లీ’ పేరున అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించింది. మంగళవారం దోమలగూడలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. పీఆర్సీ ప్రకటించే వరకూ నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని తెలిపారు.
ఆగస్టు 21 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి టీచర్లను ఉద్యమానికి సమాయత్తం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం, విద్యాశాఖ నిర్లక్ష్యంతో ప్రాథమిక పాఠశాలలు మూతబడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. విద్యారంగానికి 15 శాతం నిధుల హామీని విస్మరించారని, పూర్వప్రాథమిక విద్యను ప్రారంభించినట్టు ఘనంగా చెప్పుకొని, కేవలం యూకేజీకే పరిమితం చేశారని మండిపడ్డారు. ఉపాధ్యాయ సమస్యలన్నీ విద్యారంగ సమస్యలేనని, ఈ సమస్యల పరిష్కారానికి సర్కార్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు సీహెచ్ రవి, ఏ వెంకట్, సీహెచ్ అనిల్‌కుమార్, ఎన్ తిరుపతి, సోమయ్య, లింగారెడ్డి, బీ కొండయ్య, వై విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.