వరుసగా 11వ సీజన్లో రైతుబంధు పథకానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నెల 26నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సారి ఉమ్మడి జిల్లాలో 11లక్షల మందికి పైగా రైతుబంధు వర్తించనున్నట్లు ఇప్పటి వరకు ఉన్న సమాచారం బట్టి తెలుస్తున్నది. ఈ సీజన్‌తో కలిపి ఉమ్మడి జిల్లా రైతాంగానికి పథకం ప్రారంభం నుంచి దాదాపు రూ.11,700 కోట్ల వరకు రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం
అందినట్లు అవుతుందని అంచనా. ప్రస్తుత వానకాలం సీజన్లో సుమారు 1,300 కోట్ల రూపాయలు ఉమ్మడి జిల్లా రైతులకు అందనున్నట్లు వ్యవసాయ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. గత యాసంగితో పోలిస్తే అదనంగా మరింత మంది రైతులతోపాటు పోడు భూముల పట్టాదారులకు కూడా రైతుబంధు పథకాన్ని ఈ సీజన్ నుంచే వర్తింపజేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు మంగళవారం జిల్లాలో పలుచోట్ల వర్షం కురువడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– నల్లగొండ ప్రతినిధి, జూన్20 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, జూన్20(నమస్తే తెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో వెన్నువిరిగిన రైతును నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారడానికి దానికి నిదర్శనమే రైతు బంధు పథకం. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సీజన్ ఆరంభంలో రైతులు పెట్టుబడులకు ఇబ్బంది పడుకుండా సర్కారే ఆర్ధిక సాయం అందిస్తూ సాగుపై భరోసా కల్పిస్తున్నది. ఫలితంగా రైతులు ఎంతో ఆత్మవిశ్వాసంతో సాగును ఆరంభిస్తున్నారు. రైతుబంధు పథకం అమలు తర్వాత వేలాది ఎకరాల బీడు భూములు సైతం సాగులోకి వచ్చినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 11లక్షలకు పైచిలుకు రైతులకు సుమారు 1,300 కోట్ల రూపాయల పంట పెట్టుబడి సాయం అందనున్నట్లు ప్రాథమిక అంచనా. కాగా, గత పది విడతల్లో కలిపి ఇప్పటివరకు 10,500 కోట్ల రూపాయలు ఉమ్మడి జిల్లా రైతులకు నేరుగా ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ పథకంలో అర్హులైన ఏ ఒక్క రైతునూ వదలకుండా అవకాశం కల్పించారు. సీజన్ల వారీగా కొత్తగా పాస్‌పుస్తకాలు పొందిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. పాస్‌పుస్తకాలు ఉండీ దరఖాస్తు చేసుకోని రైతులు ఉంటే వారి వివరాలు సేకరించేలా వ్యవసాయ అధికారుల వెంటపడి మరీ పెట్టుబడి సాయం అందజేస్తున్నారు.
జూన్ 19 నాటికి రిజిస్ట్రేషన్ అయిన వారికి కూడా
ప్రస్తుత సీజన్లోనూ జూన్ 19 నాటికి రిజిస్ట్రేషన్లు పూర్తయి పాస్‌పుస్తకాలు పొందిన రైతులందరికీ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వీరందరి వివరాలు సేకరించి పథకం వర్తించేలా చూడాలని ఇప్పటికే వ్యవసాయ శాఖను ఆదేశించింది. దీంతో వ్యవసాయ క్లస్టర్ల వారీగా ఏఈవోలు దరఖాస్తులను స్వీకరించే పనిలో ఉన్నారు. దీనివల్ల ఈ వానకాలం సీజన్లో మరింత మంది రైతులు ఈ పథకంలో వచ్చి చేరనున్నారు. సుమారు 35వేల మందికి పైగా కొత్త వారికీ అవకాశం దక్కనున్నట్లు తెలుస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో స్వరాష్ట్రంలో అదనంగా 9 లక్షల ఎకరాలు సాగులోకి రావడంలోనూ రైతుబంధు పథకానిది కూడా కీలక పాత్రనే. 2018 వానకాలంలో ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున తరవాత ఐదు వేల చొప్పున రెండు సీజన్లలో అందిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు వరుసగా ఐదేండ్లల్లో పది సీజన్లకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేశారు. ఎక్కడా చిన్నా ఆరోపణకు ఊడా తావివ్వకుండా భూమి ఉన్న ప్రతి రైతుకూ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. దాంతో రైతులకు సీజన్ ఆరంభంలో పెట్టుబడి సమస్య లేకుండా పోయింది. సాగునీరు, నిరంతర ఉచిత విద్యుత్ కూడా తోడవడంతో సాగు విస్తీర్ణం ఏటా అంతకంతకూ పెరుగుతూ పోతున్నది.
11లక్షలు దాటనున్న రైతులు
రాష్ట్రంలోనే రైతుబంధు ద్వారా అత్యధిక ప్రయోజనం పొందుతున్నది ఉమ్మడి నల్లగొండ జిల్లా. ఈ వానకాలంలో అత్యధికంగా ఇక్కడ మొత్తం 11లక్షల మందికి పైగా రైతులకు రైతుబంధు వర్తిస్తుందని ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నది. అందుకోసం రూ.1300 కోట్ల వరకు అవసరం అవుతాయని భావిస్తున్నది. 2022 వానకాలంలో రైతుల సంఖ్య 10.54లక్షలు కాగా, యాసంగికి వచ్చే సరికి 10.81లక్షల మందికి చేరింది. ఈ సారి మరింత పెరిగి 11 లక్షలు దాటతుందని అంచనా వేస్తున్నారు. ఈ సారి తన రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులతోపాటు పోడు రైతులు సైతం అదనంగా లబ్ధిదారులుగా చేరనున్నారు. ఈ నెల 24 నుంచి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. పట్టాలు పంపిణీ చేశాక వెంటనే దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాంతో వారందరికీ రైతుబంధు పథకం వర్తించనున్నది. ప్రతి సీజన్లోనూ వందల కోట్ల రూపాయలను ఇస్తున్నా…. ఒక్క రూపాయి కూడా ఎవ్వరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా, నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా రైతులకే చెందుతున్నాయంటే అందుకు ప్రభుత్వం పారదర్శకత, చిత్తశుద్ధే కారణం. సమైక్య పాలనలో ఏ ప్రభుత్వ పథకంలోనైనా 20 నుంచి 30శాతం వరకు నిధులు దళారుల, అక్రమార్కుల జేబుల్లోకి చేరేవన్నది కాదనలేని సత్యం.