రఘునాథపాలెం, మార్చి 18 : ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూముల విషయంలో బాధితులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. భూదాన్ భూములపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్-కో విధించింది. కూల్చివేతకు గురైన ఇళ్లకు సంబంధించిన పేదలందరికీ న్యాయం జరిగే వరకు భూదాన్ భూములను యధాస్థితిలోనే ఉంచాలని ఆదేశించింది. అప్పటివరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని అధికారులకు సూచించింది. ఎన్నో ఏళ్లుగా భూదాన్ భూముల్లో ఉన్న పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం సీసీఎల్ఏ ఆర్డర్స్ పేరుతో గత నెల 24వ తేదీన బుల్డోజర్లతో దాడి చేసి ఆకస్మిక కూల్చివేతలను చేపట్టింది. ఆ సమయంలో బాధితుల హాహాకారాలను అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా మంత్రుల ఆదేశాలే తమకు శిరోధార్యం అన్నట్లుగా వ్యవహరించారు.
శ్రమటోడ్చి సంపాదించిన డబ్బులతో కట్టుకున్న ఇళ్లను నేలమట్టం చేస్తుంటే చూసి తట్టుకోలేక ఆ నిరుపేదలు గుండెలు బాదుకుంటూ రోదించినా అధికారులకు పేదలపై కనికరం లేకుండాపోయింది. యుద్ధప్రాతిపదికన వేలాది మంది పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేతలు చేపట్టిన ఒక్కరోజులోనే 750కి పైగా ఇళ్లను నేలమట్టం చేసి వందలాది కుటుంబాలను వీధిన పడేసింది. ఉన్న ఇళ్లను కోల్పోయిన పేదలు సామగ్రితో ఎటుపోవాల్నో దిక్కులేక అక్కడే నిరాశ్రయులుగా ఉన్న బాధితులను తీసుకొచ్చి ఖమ్మం నగరంలోని అంబేద్కర్, టీటీడీసీ భవనాల్లో పడేసింది.
నిరాశ్రయులైన బాధితులకు కల్పించిన కనీస సౌకర్యాలను సైతం పట్టించుకోకుండా వదిలేసింది. ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచి మేమున్నామనే భరోసా కల్పించింది. భూదాన్ బాధితులందరినీ పువ్వాడ ఫౌండేషన్ చెంతకు చేర్చుకొని 17 రోజులపాటు రెండుపూటలా భోజన సౌకర్యాన్ని కల్పించింది. అంతేకాదు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 24 గంటలు వైద్యులను అందుబాటులో ఉంచింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధితులను పరామర్శించారు. వారి దీనస్థితిని చూసి చలించిన ఆయన భూదాన్ భూముల్లోనే ఇళ్లు కట్టించే వరకు సర్కారుపై పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. కేటీఆర్ నిర్ణయంపై తలొగ్గిన కాంగ్రెస్ సర్కార్ భూదాన్ భూముల్లో తిరిగి నిర్వాసితులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని మాట ఇచ్చింది.
అయితే మొత్తం 412 మందినే బాధితులుగా తేల్చి 311 మందికి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసింది. మిగిలిన 101 మంది బాధితులకు స్వగ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఉన్నట్లు గుర్తించి ఇళ్లు కట్టుకునేందుకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను అందజేసింది. నిర్వాసితులైన పేదల్లో అర్హులను తేల్చడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకుంది. పట్టాలు పొందిన వారిలో అనేక మంది అనర్హులు ఉన్నారని, అసలైన నిర్వాసితులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.
హైకోర్టును ఆశ్రయించిన 20 మంది బాధితులు..
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయంపై బాధితులందరి పక్షాన 24 మంది హైకోర్టును ఆశ్రయించారు. భూదాన్ భూములపై బాధితులకే పూర్తి హక్కులు కల్పించాలని, జనవరిలో సీసీఎల్ఏ ఇచ్చిన ఆర్డర్‌ను రద్దు చేయాలని, సర్వే నెంబర్లు 147, 148, 149లకు సంబంధించిన భూదాన్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకే ప్రాధాన్యమివ్వాలనే డిమాండ్లతో ఈ నెల 13వ తేదీన కోర్టుకు వెళ్లారు. ఇండ్లు కూల్చివేత అమానుష ఘటన అని పరిగణించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం బాధితుల పక్షాన నిలబడుతుందనే భరోసాను కల్పించింది.
హైకోర్టు స్టేటస్-కోలు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో ఇళ్లను కూల్చడం చట్టవిరుద్ధమని హైకోర్టు భావించింది. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు భూదాన్ భూములపై ఎలాంటి నూతన చర్యలు చేపట్టవద్దని, యధాస్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 30వ తేదీ వరకు భూదాన్ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టరాదని, యధాస్థితిలోనే ఉన్నది ఉన్నట్లుగా ఉండనీయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, ఖమ్మం సీపీ, ఖమ్మం ఆర్డీవో, ఖమ్మం అర్బన్ తహసీల్దార్లను ఆదేశించింది. ఈ మేరకు అధికారులకు స్టేటస్-కో ఆర్డర్లను జారీ చేసినట్లు తెలిసింది.
ప్రభుత్వం దోషిగా నిలబడక తప్పదు..
నిరుపేదలు కట్టుకున్న ఇళ్లను కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబడక తప్పదు. పేదల విషయంలో న్యాయం గెలిచింది. కూల్చివేతలకు గురైన ప్రతి నిర్వాసితుడికి న్యాయం జరిగే వరకు పోరాడుతాం. ఈ ఏడాది జనవరిలో సీసీఎల్ఏ ఇచ్చిన ఆదేశాలు చట్ట విరుద్ధం. దీనిపై బాధితులు హైకోర్టును ఆశ్రయించగా స్టేటస్-కో విధించింది. ఈ నెల 30న హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ఉన్నాయి. అప్పటివరకు భూదాన్ భూములను యధాస్థానంలోనే ఉంచాలి.
– మేకల సుగుణారావు, సీనియర్ అడ్వకేట్, ఖమ్మం