‘పరాభవ’ నామధేయ..! స్వాగతం..! నీ పేరు వింటుంటేనే మనస్సు పొరల్లో ఏదో తెలియని అలజడి.. హృదయాంతరాల్లో ఏదో నెగెటివ్ వైబ్రేషన్! అవేవీ పట్టించుకోకుండా, నీ ఆగమన వేళ.. నీకు ఘనస్వాగతం పలికేందుకు మా ఇంటి ద్వారాలను ఎంత అందంగా అలంకరించుకున్నామో చూడు! నీ రాక కోసం.. నీవు ప్రసాదించనున్న షడ్రసోపేత అనుభూతుల కోసం, కొత్త అనుభవాల కోసం.. ఎంత ఆర్తిగా ఎదురుచూస్తున్నామో చూడు!
నీకూ, మాకూ ఈ అనుబంధం ఈనాటిదా? ఎప్పుడో అరవై ఏండ్ల క్రితం, నీ నిష్క్రమణ సమయంలోనే మళ్లీ వస్తానని వాగ్దానం చేశావు కదా! ఇన్నాళ్లకు తిరిగివస్తున్న నీవు మమ్మల్ని గుర్తుపట్టగలవో లేదో..! అప్పుడు మేమంతా చిన్నారులం.. పాపం, పుణ్యం, కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలు ఏమీ తెలియని బాలలం.. విరిసీ విరియని చిరునవ్వులం.. నీకు తెలుసు కదా! గరికపచ్చ మైదానాల్లో, తామరపువ్వుల కోనేరుల్లో.. గలగల పారే సెలయేర్లలో.. పంట చేలల్లో, బొమ్మరిళ్లల్లో.. అన్నింటా మేమై… అంతటా మేమై.. ఆడుతూ.. పాడుతూ.. ఎలా నర్తించామో!
నవజీవన నవపావన బృందావనం కోసం ఎన్నెన్ని కలలు కన్నామో.. నీకు తెలుసు కదా! నూనూగు మీసాల నవ యవ్వనంలో, సలసలకాగే ఉడుకురక్తంతో ఎలా ఉరకలెత్తామో.. నిండైన మా గర్భాన్ని మృదువుగా తడుముకుంటూ ఎన్నెన్ని అందమైన కలలు కన్నామో.. నీకు తెలుసు కదా! అలా అరవై ఏండ్ల క్రితం మమ్మల్ని ‘ప్లవంగ’కు అప్పగిస్తూ, నీవు మమ్మల్ని వదలి వెడుతున్న సమయాన.. ఎంతో నిబ్బరంగా, వినమ్రంగా నీకు వీడ్కోలు చెప్పిన క్షణాలు ఇంకా కండ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం.. ఇప్పుడు మేం మునుపటిలా లేం. చాలా మారిపోయాం.. ఎంతలా అంటే.. నువ్వే గుర్తుపట్టలేనంతగా!
ఆ పాతమధురాలను ఒక్కొక్కటిగా కాలగర్భంలో కలిపేస్తూ.. కొత్త ‘తరంగాల్లో’ తేలియాడుతూ.. వాటితోనే లైఫ్‌ను ‘లింక్’ చేసుకుంటూ.. ‘రీల్స్..రీల్స్’గా ‘నెట్టింట్లో’ నాట్యమాడుతూ.. ‘లైక్’లతో సేదదీరుతున్న.. సందర్భంలో కొంగొత్తగా ఉదయిస్తున్న ‘పరాభవ’ నీకు స్వాగతం! నీ పేరులోని సంస్కృత అర్థాన్ని సార్థకం చేసుకొనేలా మాకు అవమానాలు, అపజయాలు, అపకీర్తులు మిగల్చబోనని మాటివ్వు. ఓ కాలమా.. రా.. ఆప్యాయంగా హత్తుకో.. మాలోని అహంకారాన్ని, గర్వాన్ని అణచివేసి మాకు కాసింత వినయాన్ని నేర్పే ఆత్మీయుడివై మాతో నర్తించు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్స్యరాలనే అరిషడ్వర్గాలను జయించే
శక్తిని మాకు ప్రసాదించు. నీకిదే మా స్వాగతం!
– కందిబండ కృష్ణప్రసాద్