మోంట్మెలో (స్పెయిన్) : ఫార్ములా వన్ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్ ఫెరారీ జట్టులో చేరిన రెండేండ్ల తర్వాత తొలి రేసు విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా జరిగిన బార్సిలోనా గ్రాండ్ ప్రి రేసులో హామిల్టన్ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. గతంలో మెర్సిడెస్ జట్టు తరఫున 2024 జూలైలో బెల్జియం జీపీ గెలిచిన హామిల్టన్.. మళ్లీ ఇన్నాళ్లకు ఓ రేసులో నెగ్గాడు. దీంతో అతని కెరీర్ రికార్డు విజయాల సంఖ్య 106కు చేరింది.
రేసులో దూసుకెళ్లిన హామిల్టన్.. పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన జార్జ్ రస్సెల్‌ను వెనక్కి నెట్టి మరీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. లూయిస్ అందరికంటే వేగంగా (1:32:28.105సె) పోడియం ఫినిష్ చేయగా. మెర్సిడెస్ డ్రైవర్ రస్సెల్ (+19.561సె)రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.