యాదగిరిగుట్ట, ఏప్రిల్17 : బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు గులాబీ దండు కదం తొక్కాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి లక్షలాదిగా తరలివెళ్దామన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరుకాపు సత్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ స్థాయి నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ భయాన్ని నిజం చేసేవిధంగా అన్ని రాష్ర్టాల్లో గులాబీ జెండా ఎగురవేసే రోజులు ముందే ఉన్నాయన్నారు. అనేక పార్టీలు వస్తాయి.. పోతాయని, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రజలతోనే కలిసి ముందుకెళ్తుందని చెప్పారు. పట్టిన జెండాను విడువకుండా ప్రజలను ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్.. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు.
ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలు మనదగ్గర అమలు చేశారన్నారు. పదేండ్ల పాలనలో తెలంగాణకు దేశంలోనే అగ్రభాగాన నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే జల కళ ఉట్టిపడిన చెరువులు, కుంటలు, కాల్వలు నేడు ఎండిపోయి కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు నీళ్లు లేక రైతులు దెబ్బతిన్నారన్నారు. కేసీఆర్ హయాంలో సాగు, తాగునీటికి ఏనాడూ ఇబ్బంది లేదన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటవడం ఖాయమని తెలిపారు.
తెలంగాణ కోసం అనునిత్యం పరితపించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని, అందుకే ప్రజలు తమ ఇంటి పార్టీగా అక్కున చేర్చుకుంటున్నారని పేర్కొన్నారు. అబద్దాలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డిని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీపై జనంలో విశ్వాసం మరింత పెరిగిందన్నారు. గ్రామగ్రామాన ప్రజలు మళ్లీ కేసీఆరే సీఎం కావాలని అంటున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు.
రజతోత్సవ సభకు నియోజకవర్గవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్, మాజీ ఎంపీటీసీలు కాల్నే అయిలయ్య, ఎర్ర పోచయ్య, బీఆర్ఎస్ పట్టణ సెక్రటరీ జనరల్ పాపట్ల నరహరి,
మండల సెకట్రరీ జనరల్ కసావు శ్రీనివాస్, నాయకులు గుండ్లపల్లి వెంకటేశ్‌గౌడ్, మిట్ట వెంకటయ్య, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు ముక్యర్ల సతీశ్‌యాదవ్, మాజీ సర్పంచ్‌లు తోటకూరి బీరయ్య, పల్లెపాటి బాలయ్య, బైరగాని పుల్లయ్య, మార్కెట్ మాజీ డైరక్టర్ బూడిద అయిలయ్య, బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడె మహేందర్, కళ్లెం స్వాతి, ఆవుల సాయి, రేపాక స్వామి, రేపాక రమేశ్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు అహ్మద్ పాల్గొన్నారు.
రజతోత్సవ సభ కోసం ఎదురుచూస్తున్న జనం
బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే
కేసీఆర్ పాలనలో సంతోషంగా గడిపామని, మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. రజతోత్సవ సభను కలిసికట్టుగా విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ మార్పు అంటే ఎంతో గొప్పగా ఉంటుందని భావించిన ప్రజలు తీవ్రంగా మోసపోయామని బాధపడుతున్నారని పేర్కొన్నారు.
రుణమాఫీ, రైతుభరోసాపై చర్చకు సిద్ధమని కేటీఆర్, హరీశ్‌రావు సవాల్ విసిరితే సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికీ ఉలుకూ పలుకు లేదని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారనే ఉత్కంఠ ప్రజల్లో నెలకొందన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి ఈ సభ ధైర్యాన్నిస్తుందని తెలిపారు.
కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష : క్యామ మల్లేశ్
కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్జి క్యామ మల్లేశ్ అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిలదీయాలన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను అరిగోస పెడుతున్నదన్నారు. వారి పాలనలో రాష్ట్ర అభివృద్ధి పదేండ్లు వెనక్కి పోయిందని తెలిపారు. 27న జరిగే రజతోత్సవ సభకు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు.