చిట్యాల, జూన్ 07 : మూసీ నది కాలుష్యాన్ని ప్రక్షాళన చేసి, పరివాహక ప్రాంతానికి గోదావరి జలాలను అందించాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చిట్యాలలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గంలో ర్రాష్ట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరునూరైనా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తామని తెలిపారు. మూసీ ప్రక్షాళన కోసం రూ.1,50,000 కోట్లు కేటాయిస్తామన్నారు. అవి మూసీ సుందరీకరణ పనుల పేరుతో కాకుండా కాలుష్య నివారణకు కృషి చేసి గోదావరి జలాలను అందించాలని కోరారు.
రామన్నపేటలో అదానీ గ్రూప్ చేపట్టే అంబుజా సిమెంట్ కంపెనీ విషయంలో ఆ మండలంతో పాటు చిట్యాల మండల ప్రజల అభిప్రాయ సేకరణ మీటింగ్లో ముక్తకంఠంతో వ్యతిరేకించి, నిరసనలు వ్యక్తం చేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటనలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్ రూ.4 వేలు, ప్రతి మహిళకు నెలకు రూ.2,500లు ఇవ్వాలన్నారు. ఇండ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు పనులు వేగవంతం చేయటంతో పాటు ఇతర ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేశ్, మండల నాయకులు ఐతరాజు యాదయ్య, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, జిట్ట స్వామి, కృష్ణ పాల్గొన్నారు.