సూర్యాపేట రూరల్, జూలై 19:బతుకుపోరాటం చేస్తున్న రైతులపై యుద్ధం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతాంగానికి క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా గోదావరి జలాలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మూసీ ప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మార్పు పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు చీదరించుకునే స్థితికి వచ్చిందన్నారు. రైతాంగానికి నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి సీఎం రేవంత్‌రెడ్డికి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదన్నారు.
వారిద్దరికీ నీటి పారుదల రంగంపై అవగాహన లేదన్నారు. ఉత్త మాటలో.. చెత్త మాటలో చెప్పడం లేదని, తన మాటలు అబద్ధమని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనన్నారు. అక్రమ డబ్బు సంపాదనపై ఉన్న దృష్టి రైతాంగంపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పు ఒప్పుకొని కన్నెపల్లి పంప్‌హౌజ్ ద్వారా తెలంగాణ రైతులకు నీరందించాలన్నారు. దీంతో మిడ్‌మానేరు, మల్లన్నసాగర్ ద్వారా బస్వాపూర్, గంధమల్ల, ఎస్సారెస్పీ ద్వారా ఉమ్మడి నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సమృద్ధిగా నీరు అందుతుందన్నారు.
కన్నెపల్లిలో బటన్ నొక్కితే నాలుగు రోజుల్లో పెన్పహడ్ రావి చెరువుకు నీళ్లందే అవకాశం ఉందన్నారు. బనకచర్ల అనుమతుల కోసమే చంద్రబాబు, రేవంత్ కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ఎండిపోవడంతో దిగువ స్థాయి కాంగ్రెస్ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెగబడ్డారన్నారు. మూసీ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన సోలిపేట, రత్నపురం, రామారం, ఎర్కారం గ్రామాల పరిధిలోని పొలాలు సైతం గోదావరి జలాలతోనే పండాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో మూసీ డీఈ చంద్రశేఖర్, ఏఈ స్వప్న, మాజీ జడ్పీటీసీ జీడీ భిక్షం, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్‌రెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.