గంజాయి సాగుచేస్తూ విక్రయిస్తున్న ముఠాను గుడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు, కొండమల్లేపల్లి ఇన్చార్జి సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం…
పెద్దఅడిశర్లపల్లి మే 29 : దుగ్యాల గ్రామానికి చెందిన నాగిళ్ల పాండరయ్య వ్యవసాయ భూమిని పీ.ఏ.పల్లి మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన ఇస్లావత్ చందు, ప్రకాశం జిల్లాకు చెందిన సింగారావు పండ్ల వ్యాపారి కౌలుకు తీసుకున్నారు. ఇందులో సింగారావుకు నాంపల్లి మండలంలో బండతిమ్మాపురానికి చెందిన కొత్తగొల్ల శ్రీను, రెవెల్లికి చెందిన వంగూరి శివతో పరిచయం ఏర్పడింది.
ఇందులో శ్రీను, శివ, సింగారావుకు గంజాయి విత్తనాలు ఇచ్చి సాగు చేయమని చెప్పడంతో చందు, సింగారావు కలిసి మొక్కలు పెంచారు.విక్రయించి వచ్చిన ఆదాయాన్ని పంచుకున్నారు. ఈ విషయంపై పోలీసులకు పక్కా సమాచారం అందడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించగా 30 గంజాయి మొక్కలు దొరికాయి. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి వద్ద నుంచి బైక్ మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఏఎస్పీ మౌనిక స్వయంగా పర్యవేక్షించగా కేసును ఛేదించిన గుడిపల్లి పోలీసులను ఎస్పీ శరత్ చంద్ర అభినందించారు.