మోత్కూరు, ఫిబ్రవరి 7: కాంగ్రెస్‌కు ఓటేసి గోస పడొద్దని, ఒక్కసారి మోస పోతే మోసం చేసినోనిది తప్పయితదని, రెండోసారి మోసపోతే ఓట్లేసిన మనదే తప్పయితదని, మున్సిపల్ ఎన్నికల్లో రెండోసారి మోస పోవద్దని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు.
కాంగ్రెస్ నాయకుల బెదిరింపులకు భయపడొద్దని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రూపాయి పని చేయలేదని, వారి పాలన ఉన్నన్నాళ్లూ కన్నీళ్లు తప్పవన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను పట్టుకొని రేవంత్‌రెడ్డి అహంకార పూరితంగా మాట్లాడటం విచారమన్నారు. రైతులకు సాగు, తాగు నీరందించిన భగీరథడు కేసీఆర్ అని కొనియాడారు. తాను మోత్కూరు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేశానన్నారు. గడిచిన రెండేళ్లలో మందుల సామేల్ ఒక్క రూపాయన్నా తెచ్చాడా.. అని ప్రశ్నించారు.
తమ పార్టీ అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని, బెదిరింపులకు భయపడేది లేదని దమ్ముంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకోవాలని కిశోర్‌కుమార్ సవాల్ విసిరారు. అధికార పార్టీ నాయకుల వత్తిళ్లతో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసులు చట్ట ప్రకారం పని చేయాలన్నారు. మితి మీరి వ్యవహరిస్తే రెండేళ్ల తర్వాత అందరి సంగతి చూస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి నేవూరి ధర్మేందర్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర నాయకుడు కూరపాటి రమేష్, బీఆర్ఎస్ మండల, మున్సిపల్ అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్ , జంగ శ్రీను, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు తీపిరెడ్డి మేఘారెడ్డి, కొణతం యాకూబ్‌రెడ్డి, చిప్పలపల్లి మహేందర్‌నాధ్, వార్డు అభ్యర్థులు, ఇంచార్జీలు పాల్గొన్నారు.