మారుతీనగర్(మెట్పల్లి) : ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘం ( ఆకాసం ) ఆధ్వర్యంలో నిర్వహించిన బాచి అవార్డు కార్టూన్ పోటీల్లో మెట్పల్లి కార్టూనిస్టు ( Metpalli Cartoonist ) వాసం నాగరాజు ( Vasam Nagaraj ) గీసిన చిత్రానికి ప్రత్యేక విభాగంలో బాచి అవార్డు దక్కింది. ప్రతి యేట ఆంధ్రప్రదేశ్ కార్టూనిస్టుల సంఘ అధ్యక్షుడు అన్నం శ్రీధర్ బాచి తల్లి భాగ్యవతి స్మారకార్థం బాచి అవార్డు కార్టూన్ పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ యేడు బాచి అవార్డు కార్టూన్ పోటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 500లకు పైగా కార్టూన్లు వచ్చాయి. ఇందులో 13 కార్టూన్లను ఎంపిక చేయగా తెలంగాణ రాష్ట్రం నుంచి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన వాసం నాగరాజు కార్టూన్‌కు ప్రోత్సాహక బాచి అవార్డు ప్రత్యేక బహుమతి దక్కింది. ఈ మేరకు విజయవాడలోని బాలోత్సవ భవనంలో బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ హైకోర్టు న్యాయవాది కృష్ణారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు కార్టూనిస్టు నాగరాజు తెలిపారు. నాగరాజు ప్రత్యేక బహుమతి పొందడం పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.