Dasoju Sravan | మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె.. స్మార్ట్ రేషన్ కార్డులపై దాసోజు శ్రవణ్ ధ్వజం
Dasoju Sravan | రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ముద్రించేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.
Dasoju Sravan | రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ముద్రించేందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇప్పటికే ఉన్న ఈ-రేషన్ కార్డులను రద్దు చేసి, కొత్తగా 1.05 కోట్ల లామినేటెడ్ కార్డుల ముద్రణ, లామినేషన్, రవాణా తదితరాల కోసం సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.
ఆగస్టు 15న సంగారెడ్డితోపాటు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రారంభమైన కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ఆయన స్పందించారు. ‘‘మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె’’ అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి, ఉద్యోగుల పెన్షన్లు, గ్రాట్యుటీ బకాయిలు ఇవ్వడానికి నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. సొంత ప్రచారం కోసం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.
క్లౌడ్ సర్వర్లు, ప్రత్యేక వెబ్సైట్లు, ప్రింటింగ్, లామినేషన్, 33 జిల్లాలకు కార్డుల రవాణా పేరుతో ఒక్కో కార్డుకు దాదాపు రూ.100 చొప్పున ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. పేదల ఆకలి తీర్చే రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం సొంత రాజకీయ ప్రచార కరపత్రాలుగా మార్చుకుందని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అధికారులు భూముల పట్టా పుస్తకాలు, రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఫొటో పెట్టాలని సూచించినప్పుడు ‘ప్రజాధనంతో మన ఫొటోలు వద్దు’ అని తిరస్కరించారని గుర్తుచేశారు.
2021లో కొవిడ్ టీకా సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ ఫొటో ముద్రించినప్పుడు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారని శ్రవణ్ అన్నారు. మోదీ ఫొటోను వ్యక్తిగత ప్రచార సాధనంగా మార్చారని అప్పట్లో విమర్శించిన కాంగ్రెస్.. ఇప్పుడు తెలంగాణలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలను రేషన్ కార్డులపై ముద్రించడం ద్వంద్వ నీతి కాదా? అని ప్రశ్నించారు. రేషన్ కార్డు జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రజల హక్కు అని, అది ముఖ్యమంత్రి లేదా మంత్రి తమ సొంత డబ్బుతో ఇస్తున్న దానధర్మం కాదని స్పష్టం చేశారు.
2016 నాటి స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ కామన్ కాజ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని శ్రవణ్ ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనల్లో సిట్టింగ్ ముఖ్యమంత్రి ఫొటోకు మాత్రమే పరిమిత మినహాయింపు ఉందని, కేబినెట్ మంత్రి ఫొటో పెట్టేందుకు అవకాశం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోను రేషన్ కార్డులపై ముద్రించడం పచ్చి రాజ్యాంగ ఉల్లంఘన అని అన్నారు.
రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు లేదా జీహెచ్ఎంసీ ఎన్నికల కోడ్ వస్తే ఈ కార్డుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఫొటోలు తొలగించాల్సి వస్తే మళ్లీ ముద్రణ కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
బీఆర్ఎస్ డిమాండ్లు
- రేషన్ కార్డులపైనుంచి వెంటనే ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రుల ఫోటోలను తొలగించి, అధికారిక రాజముద్రతో కూడిన సాధికారిక కార్డులను ప్రజలకు ఇవ్వాలి.
- ఈ ₹100 కోట్ల దుబారాపై తక్షణమే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ – CAG) తో సమగ్ర ఆడిట్ జరిపించి, బాధ్యులైన వారి నుంచి రికవరీ చేయాలి.
- సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా మంత్రి ఫోటో ముద్రించినందుకు న్యాయపరమైన, రాజ్యాంగపరమైన చర్యలు చేపట్టాలి.
- ఎన్నికల కోడ్ వస్తే ఈ 1.05 కోట్ల కార్డుల మాటేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి.
- పేద ప్రజల అన్నం కార్డులపై తమ ముఖాలు ముద్రించుకుని ప్రచారం చేసుకోవడం సంక్షేమం కాదు.. అది పేదవాళ్లు పాలకవర్గాల దయాదాక్షిణ్యాలతో కడుపునింపుకుంటున్నారనే సందేశమిస్తూ పేదలను అవమానించడం, పక్కా రాజకీయ దివాళాకోరుతనం! తక్షణమే ఈ ఫోటో కార్డుల డ్రామా ఆపి, ప్రజల సొమ్మును ప్రజా సంక్షేమానికే ఖర్చు చేయాలి. అని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

