అర్వపల్లి, ఏప్రిల్ 16 : గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. గురువారం అర్వపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటివరకు గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహించే ప్రజా పాలన గ్రామ సభలకు టెంట్లు, కుర్చీల ఖర్చుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్నారు. ఈ ప్రజాపాలన గ్రామ సభల్లో ప్రజలు చేసుకుంటున్న దరఖాస్తులకు పరిష్కారం లేక గ్రామ పంచాయతీ కార్యాలయంలో పేరుకుపోతున్నాయని విమర్శించారు. తక్షణమే ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల సర్పంచులు వల్లపు గంగయ్య, కర్నాటి వెంకన్న, బొడ్డు ఇందిరా సోమరాజు, మేడి వీరస్వామి, అంకిరెడ్డి వీరాంజనేయులు, బానోతు సైదులు, నున్న యాదగిరి, కేలోతు కాంతమ్మ హరిలాల్, కలకోట్ల శైలేందర్ పాల్గొన్నారు.