నల్లగొండ ప్రతినిధి, జూలై4(నమస్తే తెలంగాణ): గత నెల 25వ తేదీ నుంచి మొదలైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ (సర్) విషయంలో జనాలకు సవాలక్ష సందేహాలు ఎదురవుతున్నాయి. ఇంటింటికి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ నుంచి ఆ ఫారాలను పూర్తి చేయడం, అందుకు అవసరమైన వివరాలను సేకరించడం, 2002 నాటి ఓటరు జాబితా అందరికీ అందుబాటులో లేకపోవడం, ఉన్నా అందులో ఎపిక్ నంబర్లు లేకపోవడం, వయస్సు, ఇంటిపేర్లలో తప్పులు వంటి అసమగ్ర వివరాలు ఉండటంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు అంతంత మాత్రం చదువుతో దీనిపై సరైన అవగాహాన లేక ఇక్కట్లు పడుతున్నారు. ఇక ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటితో సర్ కార్యక్రమం అనుకుంత సజావుగా ముందుకు సాగడం లేదు. దీంతో నల్లగొండ జిల్లాలో 99 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేశామని అధికారుల లెక్కలు వెల్లడిస్తుండగా వీటిల్లో కేవలం 10 శాతం మాత్రమే తిరిగి ఇవ్వగా డిజిటలైజ్ పూర్తయినట్లు సమాచారం. సర్ పూర్తికి మరో 20 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేపథ్యంలో పార్టీల భాగస్వామ్యం కీలకంగా మారింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వారీగా ఏజెంట్లను ఖరారు చేసిన ఆయా రాజకీయ పార్టీలు వారిని ఇందులో క్రియాశీలకంగా పనిచేసేలా ప్రోత్సహించాల్సిన అవసరం కనిపిస్తోంది.
నల్లగొండ జిల్లాలో 15,16,253 మంది ఓటర్లు
నల్లగొండ జిల్లాలో మొత్తం 15,16,253 మంది ఓటర్లు ఉండగా వారిలో 15లక్షల మందికి(98.98శాతం) ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. మరో 15వేల మందికి మాత్రమే ఫారాలు పంపిణీ చేయాల్సి ఉందని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఫారాల పంపిణీ సజావుగా జరిగినట్లుగా కనిపిస్తలేదు. చాలా మంది ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదన్న ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా పట్టణాల్లోని బీఎల్వోలు ఓటర్ల వివరాలు లభ్యం కాకపోవడం, లభ్యమైన వారికి ఇంటింటికి వెళ్లి ఇవ్వడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఇంటింటికి వెళ్లలేక కొందరు బీఎల్వోలు ఓటర్లకు ఫోన్ చేసి ఫారాలు తీసుకెళ్లాలని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఒకసారి ఇంటికి వెళ్లి డోర్లాక్ ఉన్నా లేక స్థానికంగా లేకున్నా ఓటర్ల వద్దకు మరోసారి వెళ్లకుండా వస్తేనే ఇస్తామన్నట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటి మధ్య దాదాపు అందరికీ ఇచ్చేసినట్లు అధికారులు లెక్కలు చూపిస్తున్నారని పార్టీల ప్రతినిధులు ఆరోపణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పంపిణీ చేసిన ఫారాలను పూర్తి చేసి తిరిగి బీఎల్వోలకు అందజేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొందరూ బీఎల్వోలు తమ వద్దకే వచ్చి ఇచ్చి వెళ్లాలని ఆదేశిస్తున్నట్లు సమాచారం. దీంతో శనివారం నాటికి సుమారు 1.45లక్షల ఫారాలు మాత్రమే తిరిగి రాగా డిజిటలైజ్ చేశారు.
క్షేత్రస్థాయిలో సమస్యలనేకం
ఫారాలు పూర్తి వివరాలతో నింపడంలో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్యుమరేషన్ ఫారాల్లోని మూడు కాలాల్లో… ఏ కాలంలో ఏ వివరాలు రాయాలన్న సందేహం చాలా మందిని వెంటాడుతోంది. దీనిపై స్పష్టత ఇచ్చే వారు లేరు. బీఎల్వోలు ఫారాలు పంపిణీ చేశాక తిరిగి కొన్నిచోట్ల అందుబాటులోకి రావడం లేదు. ముఖ్యంగా పట్టణాల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. 2002 నాటి ఓటర్ల జాబితాలోని వివరాలే సర్లో కీలకంగా మారాయి. ఇందులో అప్పటికే ఓటు హక్కు ఉన్న వారి వివరాలు సక్రమంగా ఉంటే పెద్దగా ఇబ్బంది లేదు. ఓటర్లు వెంటనే నాటి జాబితాలోని వివరాలతో ప్రస్తుత 2025 జాబితాతో సరిపోల్చుకుని ఫారాలు నింపడం సులువుగా మారింది. కానీ నాటి వివరాలు అస్పష్టంగా, అసమగ్రంగా ఉన్న వారి ఫారాలు నింపడంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక 2002 నాటికి ఓటు హక్కు లేని వారు లేదా ఆ తర్వాత జన్మించిన వారి విషయాల్లోనూ తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. వీరికి వారి రక్తసంబంధీకుల వివరాలతో ఫారాలు నింపాల్సి ఉంటుంది. అయితే వీరి వివరాలు సమగ్రంగా ఉండటం, 24 ఏండ్ల కిందటి వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు సేకరించడం సవాలుగా మారాయి. నాటి పోలింగ్ కేంద్రం నంబర్, ఓటరు సీరియల్ నంబర్, ఎపిక్ కార్డు నెంబర్లు తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రధాన ఆటంకాలు..
2002 నాటి ఓటరు జాబితాలో ఎపిక్ కార్డు నంబర్లు లేకపోవడం, ఓటర్ల పేర్లు, ఇంటి పేర్లల్లో తప్పులు ఉండటం, ప్రస్తుత ఓటర్ల జాబితాతో మ్యాచ్ కాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. అద్దె ఇండ్లల్లో నివాసం ఉంటున్న వారికి అప్పటి ఇప్పటి నివాసాలు మారడంతో ఫారాలు పొంది వాటిని తిరిగి అందజేయడంలోనూ సమస్యలు ఎదురువుతున్నాయి. ఇక 2002లో ఓటు హక్కు లేని వారికి సంబంధించి వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించడం, వాటిని పొందుపర్చడంలోనూ ఇక్కట్లు వస్తున్నాయి. అప్పటివారి ఓటరు కార్డు నెంబరు తదితర వివరాలు లభ్యం కాకపోవడం ఆటకంగా మారింది. ఆ తర్వాత పుట్టిన వారి విషయంలోనూ ధృవీకరణ పత్రాలు జత చేయడంలోనూ జాప్యం జరుగుతోంది. వీటిన్నింటికీ తోడుగా సహజంగానే కొందరు ఓటర్లు ఓటుపై పెద్దగా శ్రద్ధచూపని వారు ఉంటారు. అలాంటి వారూ సర్ పట్ల అంతే నిర్లక్ష్యంతో ఉండటం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇక ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉన్నవారూ సైతం ఎక్కడ తమ ఓటు ఉంచుకోవాలనే విషయం తేల్చుకోలేకపోవడంతో కొంత జాప్యం జరుగుతోంది.
కీలకంగా పార్టీల భాగస్వామ్యం..
ఇక వీటన్నింటినీ అధిగమించాలంటే బీఎల్వోలకు తోడుగా రాజకీయ పార్టీల తరఫున బూత్ లెవల్ ఏజెంట్ల పాత్ర కీలకంగా మారింది. సర్ సక్రమంగా సమగ్రంగా సాగాలంటే అన్ని స్థాయిల్లోనూ పార్టీల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. బీఎల్ఏలు చురుకుగా వ్యవహరిస్తే బీఎల్వోలు సైతం తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించక తప్పదు. ఇప్పటివరకు సర్లో బీఎల్ఏల పాత్ర అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. బీఎల్ఏలకు అటు గ్రామాల్లోని ఇటు పట్టణాల్లోని వార్డుల్లో ఓటర్లపై అవగాహన తప్పనిసరిగా ఉంటుంది. ఇటీవల సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు కూడా ముగిసిన నేపథ్యంలో ఓటర్లతో వారికి సత్సంబంధాలే ఉన్నాయి. దీంతో వీరు చొరవ తీసుకుంటే ప్రతీ ఓటరును సంప్రదించి వారికి ఫారాలు అందేలా చూడడంతో పాటు తిరిగి వాటిని నింపి ఇవ్వడం కూడా సులువు ఉంటుంది. దీంతో పాటు ఎక్కువ మంది ఓటర్లకు దీనిపై అవగాహన లేకపోవడంతో బీఎల్ఏలు స్వయంగా వీరికి తోడ్పాటునందించవచ్చు. ఇక అర్హులైన వారంతా ఓటు కోల్పోకుండా చూసేందుకు ఆస్కారం ఉంటుంది. పార్టీల తరఫు బీఎల్ఏల పాత్ర ఎంత ఎక్కువ పెరిగితే సర్ అంత సక్రమంగా ముందుకు సాగుతుందనడంలో సందేహం లేదు.