నల్లగొండ, నవంబర్ 20: ఆహార భద్రతలో భాగంగా దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఐ గోదాంలో డివిజనల్ కార్యాలయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ దేశ ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఆలోచనతో ఉచిత బియ్యం సరఫరా చేశామని..ఇది 2030వరకు కొనసాగిస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా 2.50 లక్షల కోట్ల ధాన్యాన్ని సేకరిస్తున్నామని చెప్పిన మంత్రి, ప్రస్తుతం 915 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ ఉన్నదని…తెలంగాణతో కలిపి 2023-24 సంవత్సరంలో 2.25 లక్షల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ప్రతి నెలా తెలంగాణకు 1.11లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు కేటాయిస్తున్నామన్నారు.
తెలంగాణలో అత్యధికంగా నల్లగొండలోనే ధాన్యం ఉత్పత్తి అవుతుందని, ప్రస్తుతం నల్లగొండలోని ఎఫ్సీఐ గోదాములో 62వేల మెట్రిక్ టన్నుల నిల్వ ఉన్నదన్న మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే మరో ఎఫ్సీఐ గోదామును ప్రారంభిస్తామన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి సంబందించి బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని పెంచాలని, పదేండ్ల నుంచి పెండింగ్లో ఉన్న రూ.1400 కోట్ల సీఎమ్మార్ బకాయిలు చెల్లించాలని కేంద్ర మంత్రిని కోరారు.
అదే విధంగా బత్తాయికి ప్రసిద్ధి చెందిన నల్లగొండకు 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీని మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ధాన్యానికి సంబంధించి ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎఫ్సీఐ ఈడీ వనితా శర్మ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఎఫ్సీఐ మేనేజర్ రాజు తదితరులు పాల్గొన్నారు.