యాదగిరిగుట్ట, జూలై 26: సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వైద్యం అందుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతతో కూడిన యంత్రాలు ప్రభుత్వాసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చాయన్నారు. 2014 కంటే ముందు సర్కార్ ఆస్పత్రికి వెళ్లాలంటే ప్రజలు భయపడేవారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు ధీమాతో సర్కార్ దవాఖానకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని వెల్లడించారు. యాదగిరిగుట్ట మండలంలోని చిన్నగౌరాయిపల్లికి చెందిన చిన్నారి లహరికి రూ.2.50 లక్షలు, వంగపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్యకు రూ.2.50 లక్షలు, రాజాపేట మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన విద్యార్థి సిద్ధార్థకు రూ. 2.50 లక్షలు, వర్దేశ్కు రూ.2.50 లక్షలు, బొమ్మలరామారం మండలం చీకటిమామిడికి చెందిన వంగరి నవీన్‌కు రూ. 2.50 లక్షలు, గుండాల మండలంలోని వెల్మజాలకు చెందిన వి.యాదవ్వకు రూ. లక్ష ఎల్ఓసీ సీఎం సహాయనిధి నుంచి మంజూరు కాగా బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయంలో ఆమె అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా యాదగిరిగుట్ట పట్టణంలో వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. గౌరాయిపల్లికి చెందిన లహరికి నిమ్స్‌లో చికిత్స జరుగుతుందని, చిన్నారి గుండె మార్పిడికి కావాల్సిన వైద్య పరీక్షలు నిమ్స్‌లో చేస్తున్నారని పేర్కొన్నారు. గుండె మార్పిడికి అయ్యే ఖర్చు తానే భరిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనూరాధ, వైస్ చైర్మన్ కాటంరాజు, కౌన్సిలర్ తాళ్లపల్లి నాగరాజు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, మండల సెక్రటరీ జనరల్ కసావు శ్రీనివాస్‌గౌడ్, బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడె మహేందర్, రైతుబంధు సమితి డైరక్టర్ మిట్ట వెంకటయ్య, చొల్లేరు సర్పంచ్ తోటకూరి బీరయ్య, రాజాపేట మండల యువజన విభాగం అధ్యక్షుడు పల్లె సంతోష్, చిన్న గౌరాయిపల్లి ఉప సర్పంచ్ గంజి పాండు, నాయకులు శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.