నందికొండ, డిసెంబర్ 9 : తెలంగాణ, ఆంధ్ర రాష్ర్టాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతూ, ఆధునిక దేవాలయంగా పేరొందిన నాగార్జునసాగర్ ఆనకట్టకు శంకుస్థాపన చేసి నేటికి 69 వసంతాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి చేరింది. రైతులు కరువుతో విలవిలాడుతున్న సమయంలో ముక్త్యాల కోట రాజైన రాజా రామగోపాల్ కృష్ణ మహేశ్వరప్రసాద్ ఆలోచనతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి బీజం పడింది. 1955 డిసెంబర్ 10న ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి నందికొండలోని పైలాన్‌కాలనీలో పిల్లర్‌తో శంకుస్థాపన చేశారు. నాగార్జునసాగర్ బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌ను వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రథమ స్థానం కల్పిస్తూ పెద్దవూర మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో నందికొండ గ్రామం వద్ద కృష్ణానదిపైన నిర్మించారు.
ప్రపంచంలోనే రాతి ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మొదటిస్థానం. 1955 నుంచి 1967 వరకు దాదాపు 12 సంవత్సరాలపాటు పూర్తిగా స్వదేశీయ ఇంజినీర్ల పరిజ్ఞానంతో, లక్షలాది మంది కూలీల మానవశక్తితో నిర్మాణం చేశారు. 11,70,000 వరద నీటిని ప్రధాన డ్యామ్ దిగువ భాగంలో 1540 అడుగుల నిడివి గల జల ప్రవాహిత( స్పిల్‌వే ) మీదుగా విడుదల చేసే విధంగా 26 రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేశారు. కుడి కాల్వ ద్వారా 11,74,874 ఎకరాలకు, ఎడమ కాల్వ ద్వారా 10,37,796 ఎకరాలకు నీరు అందించేలా కాల్వలను నిర్మించారు.
ఎడమ కాల్వ, కుడి కాల్వ వద్ద, ప్రధాన డ్యామ్ దిగువన జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసి 1.63లక్షల కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా డ్యామ్‌ను నిర్మించారు. డ్యామ్ పూర్తి స్థాయిలో నిండితే ఆయకట్టు పరిధిలో రెండు సీజన్లో పంటలు పుష్కలంగా పండుతున్నాయి. నల్లగొండ, ఖమ్మం, గుంటూరు, ప్రకాశం, కృష్ణ జిల్లాలకు సాగునీటితోపాటు హైదరాబాద్‌కు ఇక్కడి నుంచే తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది డ్యామ్ పుష్కలంగా నీరు ఉండడంతో తాగు, సాగుకు నీటికి సమస్య లేదని అధికారులు చెబుతున్నారు.