సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 30 : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు పాలన మరింత చేరువ కావడంతోపాటు ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధిస్తూ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అద్భుత విజయాలు సాధిస్తున్నామని, ఆయన నాయకత్వంలో ప్రశాంత వాతావరణంలో నిరంతర అభివృద్ధి పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో రూ.7.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన సమీకృత విద్యుత్ కార్యాలయ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కాలనే సంకల్పంతో నాటి ఉద్యమ రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ మరణం చివరి అంచుల వరకూ పోయి పోరాడి సాధించిన తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వినూత్న రీతిలో అభివృద్ధి చేస్తున్నారన్నారు.
ఉద్యమ సమయంలోనే అందరి కష్టాలు తెలుసుకున్న మహా నాయకుడిగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రజలు అడగకుండానే అవసరమైన వరాలు కురిపించే గొప్ప నేతగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. అందుకే ఆయన నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నదని చెప్పారు. అన్ని రాష్ర్టాల ప్రజలు తమకు తెలంగాణ మాదిరి అభివృద్ధి పాలన, సంక్షేమ పథకాలు కావాలని కోరుకుంటున్నారని, సరిహద్దు రాష్ర్టాల ప్రజలు తమను తెలంగాణలో కలుపమని వేడుకుంటున్నారని అన్నారు. తొమ్మిదేండ్లలోనే కోట్లాది రూపాయలతో అన్ని రంగాలను ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చేయడంతో నేడు యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని చెప్పారు. సూర్యాపేటలో ఇప్పటికే మెడికల్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం అందుబాటులోకి రాగా.. పలు జిల్లా కార్యాలయాలు ఏర్పాటై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనాత్మకంగా ప్రసాదించిన మెడికల్ కళాశాలతో వైద్య విద్యతోపాటు మెరుగైన వైద్య సేవలు మరింత చేరువయ్యాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో రూ.7.15 కోట్లతో నిర్మించ తలపెట్టిన సమీకృత విద్యుత్ కార్యాలయంలో సర్కిల్, డివిజన్, సబ్ డివిజన్, ఈఆర్ఓ కార్యాలయాలు అన్నీ ఒకేచోట ఉంటుండటంతో రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు విద్యుత్ సేవలు మరింత చేరువ కానున్నాయన్నారు. ఈ కార్యాలయ నిర్మాణం ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. నాణ్యతతో కూడిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ ఎస్ఈ పాల్‌రాజ్, డీఈ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, బీఆర్ఎస్ నాయకులు వై.వెంకటేశ్వర్లు, గండూరి ప్రకాశ్, సవరాల సత్యనారాయణ, బూరబాల సైదులు, జీడి భిక్షం, రాపర్తి శ్రీను, వెంపటి గురూజీ, సల్మామస్తాన్, కరుణశ్రీ పాల్గొన్నారు.