కొండమల్లేపల్లి, నవంబర్ 21 : కొండమల్లేపల్లి మండలం గాజీనగర్ తండాలో రూ.3.50 కోట్ల వ్యయంతో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ శుక్రవారం భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం సుస్థిరంగా అభివృద్ధి చెందేందుకు స్థిరమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకం అని, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒక సంవత్సరంలోనే దేవరకొండ నియోజకవర్గానికి 7 సబ్ స్టేషన్లు మంజూరు చేయించినట్లు, అందులో పొగిళ్ల, మేడారం, గాజీనగర్ సబ్ స్టేషన్ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
దేవరకొండ నుండి గాజీనగర్ వరకు డబుల్ రోడ్ నిర్మాణం, గాజీనగర్ నుండి షాకవెల్లి వరకు మట్టిరోడ్డు నిర్మించడంతో పాటు, గాజీనగర్ నుండి మల్లేపల్లి వరుకు జరుగుతున్న రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా, గాజీనగర్ గ్రామంలో సీసీ వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పెండ్లిపాకల ప్రాజెక్టు అభివృద్ధి కారణంగా 100 మీటర్ల పరిధిలో ప్రభావితమయ్యే 40 కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో పునరావాసం కల్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీఈ విద్యాసాగర్, ఏడి సైదులు, ఏఈ లక్కిదాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునా మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, టీపీసీసీ సభ్యులు డా. వేణుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేఖా శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, నాయకులు యుగంధర్ రెడ్డి, మేకల శ్రీనివాసులు, యాదగిరి, కాసర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొండమల్లెపల్లి మండలం పెండ్లిపాకల గ్రామంలో మత్స్య శాఖ నల్లగొండ వారి ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై గంగా పూజ చేసి అనంతరం చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులకు ఒక కోటి 30 లక్షల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పెండ్లిపాకల చెరువు రొయ్యల పెంపకానికి అనువైనది కావడంతో ఈ ఏడాది రొయ్య పిల్లలను కూడా విడదల చేస్తున్నట్లు తెలిపారు. మత్స్య కారులకు అవసరమైన వలలు, పడవలు, వాహనాలను ప్రభుత్వం తరఫున అందజేసి వారి జీవనోపాధిని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రాంతీయ మత్స్య కారులకు సౌకర్యంగా చాపల మార్కెట్ నిర్మాణం అతి త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మత్స్య శాఖ ఏడీ రాజారాం, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునా మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, టీపీసీసీ సభ్యుడు డా.వేణుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేఖా శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సిరాజ్ ఖాన్, మండల అధ్యక్షుడు ఉట్కూరి వేమన్ రెడ్డి, నాయకులు యుగంధర్ రెడ్డి, మేకల శ్రీనివాసులు, యాదగిరి, కాసర్ల వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ శక్రు నాయక్, జిల్లా సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Kondamallepally : గాజీనగర్ తండాలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన