నల్లగొండ, జూన్ 3 : బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాసర్‌రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్ కుమార్‌తో కలిసి రవీంద్రకుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం పార్టీ జెండా ఎగురవేసి జయ జయహే తెలంగాణ గీతాలాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావానికి ముందు పరిస్థితులను, కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేండ్లలో చేపట్టిన అభివృద్ధిని ఎల్ఈడీ స్రీన్‌పై ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను నాయకులు, కార్యకర్తలు ఆసక్తితో తిలకించి నాటి సంఘటనలను గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జడ్పీ చైర్మన్ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ నేత కేసీఆర్ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా పదేండ్లలో ప్రజల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. కేసీఆర్ నిత్యం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పరితపించారని తెలిపారు. ఈ పదేండ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఇంకా పాలనపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ పద్ధతి మార్చుకొని ప్రజాపాలన సవ్యంగా చేయాలని సూచించారు.
అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు తిప్పన విజయసింహారెడ్డి, రామచందర్‌నాయక్, పల్లె రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలీ, రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, నాయకులు పిచ్చయ్య, రామ్మోహన్, జమాల్ ఖాద్రీ, సహదేవరెడ్డి, శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, దేప వెంకట్‌రెడ్డి, యాదయ్య, గోవర్ధన్, జాఫర్, లక్ష్మయ్య పాల్గొన్నారు.