మన జీవితాల్లోంచే కథలు పుట్టుకోస్తాయనడానికి ఈ పుస్తకమే సాక్ష్యం. మధ్యతరగతి జీవితాలను కథా వస్తువులుగా చూపించే ప్రయత్నంలో రచయిత సఫలీకృతమయ్యారు. ఈ నిశ్శబ్ద ఖడ్గంలో ఉన్న పద్నాలుగు కథల్లోని అంతిమ సారాంశం సమాజంలోని వ్యక్తుల స్వభావాలను తెలియజేయడమే! కష్టాలెన్ని వచ్చినా ఎదుటివారి వద్ద యాచించకుండా ‘చిద్విలాసుడు’గా జీవించే సన్యాసి లాంటి వాళ్లు ఈ రోజుల్లో అరుదుగా ఉంటారు.
ఉన్నట్టుండి భర్త గుండెపోటుతో హాస్పిటల్లో చేరితే, ‘సగము నివ్వెరపోయే’ పార్వతి తన దుఃఖాన్నంతా దాచుకొని భర్త ఆరోగ్యాన్ని, ఇంటిని కాపాడే తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. మరో కథలో విదేశాల్లో విచిత్రంగా పరిచయమైన ఏకాంత్, గాయత్రీలతో ఏర్పడిన స్నేహంతో కొత్త ఉత్సాహానికి లోనైన పెద్దాయన.. ఏకాంత్కు ఉద్యోగం ఇప్పించే విషయంలో ‘నిశ్శబ్ద ఖడ్గం’లా వ్యవహరిస్తాడు.
రచయిత గతంలో బ్యాంక్లో పనిచేయడం వల్లే ‘బంగారు తల్లి’ పాత్రను తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. క్యాన్సర్తో చనిపోయిన తన భర్తను తలుచుకొని బాధ పడుతున్న బంగారు తల్లిని లోన్ కట్టాలని ఇబ్బంది పెట్టే బ్యాంకు అధికారిపై కోపం వస్తుంది. బంగారు తల్లి లోన్ కట్టిన పెద్దమనిషే అప్పు కింద ఆ ఇంటిని ఆక్రమించడం.. సమాజంలో ఒంటరి మహిళల కష్టాలకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఇలా ప్రతి కథలోనూ మధ్యతరగతి బతుకులే కనిపించాయి. ప్రతీ కథ మనసును తాకుతుంది. కథనం చక్కగా చదివిస్తుంది.
రచయిత: చాగంటి ప్రసాద్ (చా.ప్ర)
పేజీలు: 112, ధర: రూ.150
ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, విశాలాంధ్ర బుక్ హౌస్
-రాజు పిల్లనగోయిన