రోడ్డుకిరుపక్కలా పంటలతో ఏపుగా పెరిగిన పొలాలు నిండు గర్భిణిలా కళకళలాడుతున్నాయి. ఎండ పెళపెళలాడుతోంది. పొలాలలో మనుషుల సందడి లేదు, చకచకా పైరులోంచి వరినితీసే యంత్రాల చప్పుడు తప్ప. యంత్రం.. కోసిన పనల నుంచి వడ్లు లోపల వేసుకుని, గడ్డిని పొలంలో వదిలేస్తోంది.. స్వార్థంతో పనిచేసే రాజకీయనాయకుడిలా. పోగేసిన ధాన్యం యంత్రంలోంచి ట్రక్ద్వారా గట్టు మీదికి వస్తోంది. గట్టు మీద జత మనుషులు ధాన్యాన్ని కాళ్లతో, చేతులతో ఎడంగా పరుస్తూ తడియారబెడుతున్నారు. బాగా ఎండిన ధాన్యాన్ని గోనెసంచిలోకి ఎత్తి మూటలు కడుతున్నారు.“పురుషోత్తం బావా! నిన్ను చూస్తే నాకు తెలియకుండానే అసూయ పుట్టుకొస్తోంది” అంటూ పొలం గట్టుమీద పొడవాటి చేతికర్ర గెడ్డానికి ఆనించుకుని నిలబడ్డ కృష్ణమూర్తి చెప్పాడు.
మధ్యమధ్యలో పనిచేస్తున్న వాళ్లని పశువుల్ని అదిలించినట్లు అదిలిస్తున్నాడు.“నా దగ్గర అంత యవ్వారం ఏముంది బావా?” “మేమంతా మిషన్లు పెట్టి వ్యవసాయం చేస్తూంటే, నువ్వు మనుషులతోనే చేస్తావు” “ఒకరోజులో మనుషులు చేసే పని మిషన్ గంటల్లో చేస్తుంది. యంత్రం కిరాయి ఒకరి జేబులోకే వెళ్తుంది. నలుగురు మనుషులు కష్టం చేస్తే వచ్చే కూలీపైసలు నాలుగు కుటుంబాల కడుపు నింపుతాయి. ఎద్దులుగా మారాల్సిన గిత్తలు.. అచ్చోసిన ఆబోతులు అయిపోతున్నట్లు, పొలం పనులు మర్చిపోతే జనం యంత్రాలు అయిపోతారనే భయంగా ఉంది బావా! ఏదైనా మీరు కాలంతో నడుస్తున్నవాళ్లు, నేను వెనుకబడ్డ సత్తెకాలం మనిషిని” పురుషోత్తం మధ్యతరగతి రైతు. చదువుకున్నవాడు. ఊర్లో ఇంకా చదువుకున్న వాళ్లున్నా.. కాగితం చదవాలన్నా, రాయాలన్నా పురుషోత్తమే కావాలి. కారణం.. మనిషి నిదానస్తుడు. నమ్మకస్తుడు. చెప్పింది వింటాడు, చెప్పినట్లు చేస్తాడు. తలలో నాలుకలాంటి వాడు. ఊరు-వాడ సమస్య ఏదైనా పురుషోత్తం పరిష్కారం చెప్పవలసిందే.“అవును బావా! ఎమ్మెల్యే గారిని కలిశారుగా, మన ఊరిలో రోడ్లు ఎప్పుడు వేస్తారని చెప్పారు. జనం బాగా ఇబ్బంది పడుతున్నారు” “రోడ్డు పడుతుందనే అంటారు. ఎన్ని ఎలక్షన్లు చూడలేదూ! రోడ్లు పడేదాకా పనులు ఆగుతాయా?”.. అప్పుడే అటుగా సైకిలు మీద వెళ్తున్న మరిడయ్య పురుషోత్తాన్ని చూసి ఆగాడు. సైకిలు పక్కగా ఆపుకొని పొలం వైపు వచ్చాడు.“పురుసోత్తం బాబూ! నేను, మా ఇంటిది రేతిరంత మీరు సేసిన సాయం తలుసుకుంటూనే ఉన్నాం. అమ్మాయి కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. ఆలస్యమైతే తల్లి, బిడ్డ దక్కేది కాదన్నారు డాట్టరుగారు. మీ దయ..” అంటూ కాళ్ల మీద పడబోయాడు.
“చూడు మరిడయ్యా! భగవంతుడి దయ. నా దగ్గర కారున్నదీ, గుమ్మం ముందు కవరేసుకుని పెట్టుకుందుకు కాదు. అవసరానికి పనికి రావాలి. ఈరోజు నీకు పయోగపడింది. అంతేకాదు.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారంటే సంతోషమేగా!” అంటూ మరిడయ్యను వారించాడు.“వత్తాను బాబూ! పిల్లకి పత్తెం బువ్వ పట్టుకెలుతున్నా” అంటూ వెళ్లిపోయాడు మరిడయ్య.“చూశావా బావా! ఇప్పుడైనా అర్థమైందా? నువ్వంటే ఎందుకు అసూయో? నీలాగా చేద్దామనుకుంటే నా వల్ల కావటంలేదు” అన్నాడు కృష్ణమూర్తి. “అదేంలేదు బావా! అవసరమైతే నువ్వు ఇంతకంటే ఎక్కువ చేస్తావు. చేసావు కూడా! మీ చెల్లాయి, నేను వచ్చేవారం సిటీకి వెళ్తున్నాం. నేను వచ్చేదాకా నువ్వే చూసుకోవాలి. నీకు తెలుసుగా, శివ కోటిన్నర పెట్టి ఇల్లు కొన్నాడు. గృహప్రవేశానికి వెళ్లాం. మొత్తం ఇల్లంతా పూర్తయిన తర్వాత మళ్లీ చూడలేదు. రమ్మని ఒకటే గోల!” “కోటిన్నరే…?” ఆశ్చర్యపోయాడు కృష్ణమూర్తి.“రేటు వింటే మనకి చుక్కలు కనిపిస్తున్నాయి. బ్యాంకు అప్పు నెలనెలా వాయిదాలు కట్టినప్పుడు వాడు చుక్కలు చూస్తాడు” “మరీ కోతలు పని..” “అందుకేగా పది మందిని ఎక్కువ పెట్టుకుని మరీ పూర్తి చేస్తున్నాను. నేను వెళ్లేలోపు ధాన్యం నూర్పు పూర్తి చేసి, ఒబ్బిడి చేసేస్తా. షావుకారుతో రేటు మాట్లాడి పెట్టాను. మాల్ కాటాకి ఎత్తడమే! ఆ పని నువ్వు చూసుకోవాలి” “ఓస్! అదేముందిలే. అలవాటైన పనేగా, చిటికెలో చేస్తా. నాకో అనుమానం..”ఆగిపోయిన కృష్ణమూర్తి వైపు చెప్పమన్నట్లు చూశాడు పురుషోత్తం.
“అదే బావా! కోట్లు పోసి కొనే అంత ఆ ఇంట్లో ఏముంటుందా!? అని”“గేటెడ్ కమ్యూనిటీట..” “అంటే..” “అందులోనే మంగలి షాపు, మందుల షాపు, సూపర్ మార్కెట్ ఉంటాయి. డాక్టర్ క్లినిక్, పిల్లల ఆటస్థలం, పెళ్లిళ్లు-పేరంటాలు చేసుకోవడానికి మండపం, స్నానాలకు చెరువంత స్విమ్మింగ్ పూల్, వినోదానికి సినిమా హాల్, గ్రంథాలయం, గుడి, బడి ఇలాంటివి ఇంకా ఏవేవో చెప్పాడులే! వెళ్లాలంటే యజమాని అనుమతి లేకుండా సెక్యూరిటీ టీం లోపలకి పంపించరు” “ఇవన్నీ ఒక్కడికే?” అమాయకంగా అడిగాడు కృష్ణమూర్తి.
“అక్కడుండే వేయి కుటుంబాల కోసం. అందులో మావా డిదొకటి. అలా కలిసి జీవించడంలో ఆనందమే వేరు” “మన ఊరికంటే పెద్దదన్నమాట, చెపుతుంటేనే చూడాలనిపిస్తోంది” “దానికేం బావా! వెళ్దాంలే”ఆ మాటకే వెళ్లినంత ఆనందపడిపోయాడు కృష్ణమూర్తి.సూర్యుడు పడమటి దిక్కులోకి వెళ్లిపోవడంతో పనులు ఆపి, కోసిన ధాన్యం మీద నల్లటి టార్పాలిన్లు కప్పి ఇళ్లకు వెళ్లిపోయారు.
పది ఫ్లాట్స్ ఉండే అపార్ట్మెంట్లోంచి పదివందల ఫ్లాట్స్ ఉండే గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్తుంటే.. గుడిసెలోంచి రాజమందిరంలోకి వెళ్తున్న ఫీలింగ్. వచ్చిన వాళ్లందరినీ గేటు దగ్గర ఆపి, విచారించి మరీ లోపలికి పంపించే సెక్యూరిటీ. వచ్చేపోయే వాహనాలకు ప్రత్యేకంగా తెరుచుకునే గేట్లు. ఏ కారు ఎక్కడ పార్కింగ్ చేయాలో నెంబర్తోసహా చూపించే బోర్డ్స్. ఒకవైపు నుంచి లోపలికి వెళితే మరోవైపు నుంచి బైటికి రావాలి. ఈ ఏర్పాట్లు పురుషోత్తానికి బాగా నచ్చాయి.ఇంటిలోకి వెళ్లే ముందే తల్లిదండ్రులకి అక్కడున్న సౌకర్యాలు, పరిసరాలన్నీ చూపించాడు శివ. అక్కడ మార్నింగ్ వాక్ కోసం వేసిన మార్గం చూస్తే టన్నులకొద్దీ బద్దకం ఉన్న వాళ్లకైనా నడవాలనిపిస్తుంది. ఇంట్లోకి అడుగుపెడితే విశాలమైన హాల్. జారిపోయే టైల్స్ ఫ్లోరింగ్, స్లయిడింగ్ డోర్స్, ఇంట్లో వస్తువు ఏదీ కనిపించకుండా లోపలే దాచుకునే ఎత్తయిన కప్‌బోర్డ్స్. ఇద్దరికీ ఇల్లు బాగా నచ్చేసింది.“శివా! ఇల్లు, చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుందిరా. ఇంతమంది జనమే మన బలం. ఈ జనంతో కలిస్తే అద్భుతాలు సృష్టించచ్చు. మంచి పని చేశావురా. చాలా ఆనందంగా ఉంది” అని అక్కున చేర్చుకున్నాడు.
తెల్లారకముందే పాల పాకెట్స్, పేపర్.. రెండూ గుమ్మం ముందు వచ్చి వాలాయి. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ లాంటి డెలివరీ వాళ్ల సందడి గట్టిగా ఉంది. బాల్కనీలో కూర్చుని మంద్రంగా గుడి నుంచి వచ్చే పాటలు వింటూ, స్కూల్‌కి వెళ్లే పిల్లల కోసం వచ్చే బస్సులు, వ్యానులు. మార్నింగ్ వాక్ చేసే పెద్దలు, పరుగులు తీసే యువకులని చూస్తూ నాలుగు రోజులు బాగానే కాలక్షేపం అయింది. కృష్ణమూర్తి ఊరి నుంచి ఫోన్‌చేసి.. ధాన్యం బస్తాలు కాటాకి వేసేశామని, షావుకారు మొత్తం పైకం ఖాతాలో వేస్తానన్నాడని చెప్పాడు. దాంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు పురుషోత్తం.క్రమేపి పురుషోత్తానికి అక్కడ జీవనశైలి అర్థమౌతోంది. ఇంతమంది ఉన్నచోట రోజువారీ పనుల్లో ఉరుకులు, పరుగులు తప్ప ఉత్సాహం లేదు. పలకరింపులు లేవు. అందరూ.. ‘నన్ను ముట్టుకోకు నామాల కాకి’లా ఉన్నారు.
ఆ రోజు రాత్రి కొడుకుని పిలిచి.. “శివా! ఎదురు గుమ్మంలో ఉండేదెవరు?” అని అడిగాడు. వాళ్లెవరూ పరిచయంలేదని చెప్పాడు శివ.“పోనీ పక్క ఫ్లాట్స్ వాళ్లు తెలుసా?”“ముస్లింలో, క్రిస్టియన్లో అనుకుంటా” “నేనడిగింది.. కులం, మతం కాదు. ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది. చుట్టుపక్కలవాళ్లు తెలియదంటే ఆశ్చర్యంగా ఉందిరా”“నాన్నా! ఒకరి అవసరం మరొకరికి ఉండదు. దానికంటే ముందు అసలు సమయమే ఉండదు. వీకెండ్స్ వాళ్ల ఔటింగ్‌లో వాళ్లుంటారు. మా ప్రోగ్రాం మాది” చాలా తేలికగా చెప్పాడు కొడుకు.పురుషోత్తానికి మతిపోయింది.
“మీరంతా కలిసి వినాయకచవితిలాంటి పండుగలు చేసుకోరా?” “చేసుకుంటాం. దాని కోసం కమిటీ ఉంది. వాళ్లు చేస్తారు. చందాలు అడిగితే ఇవ్వాలనుంటే ఇస్తారు. లేకపోతే లేదు. సింపుల్” చిన్న విషయంలా చెప్పాడు.పురుషోత్తానికి అక్కడ బంధాలు, సంబంధాల మీద పూర్తి అవగాహన వచ్చింది. వేల కుటుంబాల మధ్య జీవితం వెన్నెలగా ఉంటుందని భావించిన పురుషోత్తానికి పుస్తకం అట్ట చూసి లోపల పాఠం అంచనా వేయకూడదని అర్థమైంది. అంతమంది మధ్య ఉండి అనుభవించే ఒంటరితనం గురించి మిత్రుడు కృష్ణమూర్తికి ఫోన్లో చెప్పాడు.
పొద్దునే సోఫాలో కూర్చుని పేపర్ తిరగేస్తున్న పురుషోత్తానికి ఎదురింట్లోంచి చిన్నగా పిల్ల ఏడుపు వినిపించింది. స్కూలుకి వెళ్లనని మారాం చేస్తున్నట్లు తల్లిమాటల్లో అర్థమైంది. మాట వినటం లేదని తల్లి దెబ్బ వేసినట్లుంది. ఏడుపు కొంచెం పెంచింది. ఏడుస్తూ లిఫ్ట్ దగ్గర కనిపించింది. బ్లూ అండ్ వైట్ కలర్ స్కూల్ యూనిఫాంలో పుస్తకాల సంచిని మోయలేనంత బలహీనంగా ఉంది. మారుతున్న విద్యావ్యవస్థ మీద కోపం, పిల్లల మీద జాలి వేసింది.అదేరోజు మధ్యాహ్నం గ్రౌండ్‌ఫ్లోర్ బెంచ్ మీద కూర్చుని కృష్ణమూర్తితో ఫోన్ మాట్లాడుతుంటే.. స్కూల్ బస్సులు వచ్చి పిల్లలని దింపి వెళుతున్నాయి. పిల్లలని దించుకున్న తల్లులు ఆత్రంగా అక్కడే నిలబడి మర్నాటికిచ్చిన వర్కులు, పరీక్షలో వచ్చిన మార్కులు, అసైన్మెంట్ రాసిన పుస్తకాలు చూసుకుంటున్నారు. అప్పుడు అర్థమైంది.. బలహీనపడుతున్న విద్యావ్యవస్థ వేర్లు ఎక్కడున్నాయో.
పురుషోత్తం దృష్టి పొద్దున్న ఏడుస్తూ స్కూల్‌కి వెళ్లిన పిల్లమీద పడింది. వాళ్ల అమ్మ మిగతా తల్లులకు మినహాయింపుగా లేదు. వర్కు పుస్తకాలు చూసే హడావుడిలోనే ఉంది. చిన్నారి, చిట్టి స్నేహితురాలికి వీడ్కోలు చెప్పే సరదాలో బస్సు ముందుకు వెళ్లింది. అది గమనించని డ్రైవర్ బస్సుని ముందుకు కదిపాడు. కెవ్వమని చిన్నారి పెట్టిన కేక.. డ్రైవర్ కాలును బ్రేక్ మీద వేసేలా చేసింది. తల్లి ఘొల్లుమంది. అక్కడున్న జనం చూస్తున్నారే కానీ, ముందుకు రాలేదు.లుంగీలో ఉన్న పురుషోత్తం పరుగున వెళ్లి బస్సు చక్రం దగ్గర తెలివితప్పి పడున్న పిల్లని రెండుచేతులతో ఎత్తుకుని బస్సులోకి చొరబడి.. “డ్రైవర్! దగ్గరలో ఆసుపత్రికి తీసుకెళ్లు” అని బిగ్గరగా అరిచాడు. తల్లి ఏడుస్తూ బస్సు ఎక్కింది. పిల్ల గుండెమీద చేయివేసి చూసాడు పురుషోత్తం. హార్ట్‌బీట్ వేగంగా కొట్టుకుంటోంది. షాక్‌తో స్పృహ కోల్పోయిందని అనిపించింది. పెద్ద ప్రమాదం తప్పిందని పురుషోత్తానికి అర్థమైంది. తల్లి చేసిన ఫోన్‌కి ఆసుపత్రికి వచ్చాడు తండ్రి. పాపకి పరీక్షలు చేసిన డాక్టర్.. షాక్ తప్ప మరే ప్రమాదం లేదని చెప్పాడు. పిల్ల తల్లితండ్రులతోపాటు డ్రైవర్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పసిపాప తల్లితండ్రులు, అసోసియేషన్ మెంబర్లు కురిపించిన ప్రశంసలు పురుషోత్తాన్ని ఇబ్బంది పెట్టేలా చేసాయి. కమ్యూనిటీలో సంచలనవార్తగా పాకిపోవడంతో పొద్దునే వాకింగ్ చేసేవాళ్లు, యువకులు పురుషోత్తాన్ని హీరోలా చూసారు. ఇక్కడ జరిగింది కృష్ణమూర్తికి చెపితే.. ‘ఎక్కడికి వెళ్లినా మా బావ హీరోనే’ అని సరదాగా వేళాకోళం చేశాడు.
పదో ఫ్లోర్లో కాపురం ఉండే రిటైర్డ్ మేజర్ పరమేశం స్వయంగా పరిచయం చేసుకుని పురుషోత్తం సమయస్ఫూర్తికి అభినందించాడు. పురుషోత్తం రైతని తెలిసిన వెంటనే.. ‘జై జవాన్, జై కిసాన్’ అని మేజర్ అన్నప్పుడూ, తన కొడుకు మిలిటరీలో ఉన్నాడని చెప్పినప్పుడూ మేజర్ కళ్లలో కాంతి తొణికిసలాడింది. మేజర్ చెప్పిన కార్గిల్ యుద్ధ విశేషాలు, మద్దతు ధర కోసం రైతులు పడే ఆవేదన, కరచాలనంతో మొదలైన వారి పరిచయాన్ని స్నేహంగా మార్చాయి.మేజర్ పరమేశం, పురుషోత్తం రోజూ కలవడం, కబుర్లు చెప్పుకోవడం, పొలం పనులకి కొంత విరామం ఉండటంతో ఊరి మీద ధ్యాస తగ్గింది. ఆరోజు మేజర్ రాలేదు. అంబులెన్స్ వచ్చింది. స్ట్రెచర్ మీద నిర్జీవంగా పడున్న మేజర్ని లిఫ్ట్వైపు తీసుకెళ్తున్నారు. కన్నీటితో దుఃఖాన్ని దిగమింగుకుని ఆయన భార్య వెంబడిస్తోంది. చెదిరిపోయిన మనసుతో అనుసరించాడు పురుషోత్తం. ఫ్రీజ్ బాక్స్‌లో శవాన్ని పడుకోబెట్టి ఆసుపత్రి స్టాఫ్ వెళ్లిపోయారు. ఆమె ఒంటరి అయ్యింది.
“అమ్మా! ఇంత సడన్‌గా..” “రాత్రి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లా. వెళ్లిన మూడు గంటలకు మళ్లీ వచ్చింది. అంతే..” “మరీ బాబూ!..” “ఫోన్ చేసాను. బయలుదేరారు” పంటికింద బాధ అణచుకుంటూ చెప్పింది.పనమ్మాయి వాటర్ బాటిల్ తెచ్చి ఆమెకు ఇచ్చింది. ఆమె రెండు గుక్కల నీళ్లు గొంతులో పోసుకుంది.కాసేపటికి కంటోన్మెంట్ నుంచి మిలటరీ ఫ్రెండ్స్ వచ్చారు. శవం మీద పుష్పగుచ్చాలు ఉంచి ఆమెతో మాట్లాడి శ్రద్ధాంజలి ఘటించి వెళ్లిపోయారు. మళ్లీ ఆమె ఒంటరి. అసోసియేషన్ వాళ్లు పలకరించి వెళ్లారు.రాత్రి పదిగంటలకు కొడుకు, కోడలు వచ్చారు. అప్పటిదాకా అణచిపెట్టుకున్న ఆమె దుఃఖం పెద్దపెట్టున ఏడుపులా తన్నుకొచ్చింది. కొడుకు తల్లిని దగ్గరికి తీసుకున్నాడు. ఓదార్చాడు. కోడలు వీపు నిమురుతూ నిల్చుంది. పురుషోత్తం దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పాడు. ఓదార్పుగా కొడుకు భుజం తట్టాడు. శ్మశానవాటికలో ఏర్పాట్లు ఆర్మీ ఫ్రెండ్స్ చేసారు.మరుసటిరోజు ఉదయం కర్మ చేసే పంతులుగారితోపాటు మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ వచ్చింది.ప్రతిరోజూలాగే నడిచేవాళ్లు నడుస్తున్నారు. పరుగెత్తే వాళ్లు పరుగెడుతున్నారు. కొందరు ఆఫీసులకు వెళుతున్నారు. పిల్లలని స్కూల్ బస్సు ఎక్కించాలని కిందికి దిగినవాళ్లు ఇంకొందరు. అందరినీ ఆపే ప్రయత్నంలో..“ఒక్కసారి మాట వినండి, ప్లీజ్” అరిచాడు పురుషోత్తం. కొంతమంది ఆగారు.
మరికొంతమంది దృష్టి పెట్టారు.“నా పేరు పురుషోత్తం. పదో బ్లాక్ పన్నెండో ఫ్లోర్లో ఉండే శివ తండ్రిని. ఇక్కడకొచ్చి ఇరవై రోజులయింది. వేయికుటుంబాలు ఒకచోట ఉన్నాయంటే ఎంతో హాయిగా ఉంటుందని ఊహించుకుని చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన రైతుని. పెద్దగా చదువుకున్న వాడిని కాదు”..ఆ మాటలు ఎందుకో అర్థంకాక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.“మీ అందరి జీవనశైలి చూస్తున్నాను. మా అబ్బాయి ఇక్కడకొచ్చి చాన్నాళ్లయినా పక్కవాళ్లు తెలువరు. ఎదురింటి వాళ్లకి మా అబ్బాయి తెలువడు. కొంతమంది విషయంలో మినహాయింపు ఉండవచ్చమో. రెండు వారాల క్రితం ఇక్కడే చిన్నపాపకి దెబ్బ తగిలితే చూసారు కానీ, ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పుడు కొంత అర్థమైంది” అని చెప్పి.. ఆ పాపకోసం పిల్లల గుంపులో వెతికి మళ్లీ ప్రారంభించాడు.
“ఇప్పుడు పూర్తిగా తెలిసింది. మనతో కలిసి జీవించే మనిషి చనిపోయాడు. ఇంతమంది ఉన్నా కూడా తల్లి, కొడుకు, కోడలు శవాన్ని పెట్టుకుని రాత్రంతా కూర్చున్నారు. మనం చూపించే చిన్న సానుభూతి ఆ కుటుంబానికి పెద్ద ఓదార్పుని, మానసిక ధైర్యాన్నిస్తుందని ఎవరికీ అనిపించలేదు” ముందున్నవారిలో కొంతమంది విసుగ్గా చూశారు. అవేమీ పట్టించుకోకుండా చెప్పుకొంటూ పోతున్నాడు పురుషోత్తం.“ఆ వ్యక్తి తన జీవితాన్ని సరిహద్దులలో శత్రువులనుంచి దేశాన్ని రక్షించడం కోసం త్యాగం చేసినవాడు. కార్గిల్ యుద్ధంలో పోరాడిన మేజర్. అంతేకాకుండా ప్రాణానికి ఏ క్షణంలోనైనా ప్రమాదం పొంచి ఉంటుందని తెలిసి కూడా దేశరక్షణ కోసం కొడుకుని మిలటరీకి పంపిన గొప్ప మనసున్న మనిషి! అటువంటి వ్యక్తి మన మధ్య ఉండటం మన అదృష్టం. ఆ వ్యక్తి కుటుంబానికి కనీస సానుభూతి చూపించకపోతే, వారి కోసమే నిమిషం నిలబడి మౌనం పాటించలేకపోతే ఇంకెవరి కోసం ఆలోచిస్తాం. చెప్పండి. హద్దులు అతిక్రమిస్తే మన్నించండి” అని వస్తూన్న దుఃఖాన్ని ఆపుకొనే ప్రయత్నం చేశాడు.
అందరూ స్థాణువులా నిలబడి పోయారు.అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. ఇంతలో ఓ యువకుడు ఆవేశంగా వచ్చి పురుషోత్తం భుజం మీద చేయి వేసి.. “మొదట మనమంతా మేజర్ పరమేశంగారి ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం. వారి మృతదేహానికి నివాళులు అర్పిద్దాం, అవకాశం ఉన్నవారు అంతిమయాత్రలో పాల్గొందాం” అని పిలుపునిచ్చి.. శ్రద్ధాంజలి కోసం మౌనంగా తలదించుకున్నాడు.మనసు కదిలిన కొంతమంది కమ్యూనిటీ వాసుల ‘అమర్ రహే’ నినాదాల మధ్య మేజర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ఉదయించే సూర్యుడిని చూశాడు పురుషోత్తం.
పెమ్మరాజు విజయరామచంద్ర
రచయిత పెమ్మరాజు విజయరామచంద్ర పుట్టిపెరిగింది కోనసీమ కేంద్రం అమలాపురం. ప్రస్తుత నివాసం హైదరాబాద్. భారతీయ స్టేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పదవీ విరమణ చేశారు. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహంతో విద్యార్థి దశనుంచే కవితలు రాయడం మొదలుపెట్టారు. వాటిలో కొన్ని ప్రగతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఉదయం, ఆంధ్రభూమి, భారతిలాంటి ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. ఉద్యోగ బాధ్యతల నడుమ సాహితీ ప్రయాణం కుంటుపడినా.. రాయాలనే తపన మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత భార్య కృష్ణవేణి ప్రోత్సాహంతో కథా ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటివరకూ 70 వరకూ కథలు రాశారు. అందులో నలభైకి పైగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ప్రజాశక్తి, ఉషా, వార్త లాంటి వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వివిధ సంస్థలు, పత్రికలు నిర్వహించిన పోటీలలోనూ బహుమతులు పొందాయి. దూరదర్శన్‌లో ప్రసారమైన కొన్ని ధారావాహికలకు సంభాషణల రచయితగానూ పనిచేశారు. పత్రికల్లో ప్రచురితమైన కథలు, బహుమతి కథలతో విరగని అల, వరి కంకులు పేరుతో కథా సంపుటాలను ప్రచురించారు.
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
-పెమ్మరాజు విజయరామచంద్ర
98497 44161