బూర్గంపహాడ్, జూన్ 5 : పనికితగ్గ వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపాధిహామీ కూలీలు బూర్గంపహాడ్ మండలం మోతే పట్టీనగర్లో శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు మాట్లాడుతూ వేసవి కాలంలో ఐదు గంటలపాటు కష్టపడి పనిచేసినా కూలి మాత్రం రూ.130 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం క్షేత్రస్థాయిలో లక్ష్యానికి విరుద్ధంగా కొనసాగుతోందని మండిపడ్డారు. ఎండ తీవ్రత వల్ల పని ప్రదేశంలో విశ్రాంతి తీసుకునేందుకు నీడ సౌకర్యం కూడా లేదని, కనీసం తాగేందుకు మంచినీరు ఉండటం లేదని ఆరోపించారు. కాగా, కూలీల ఆందోళన విషయం తెలుసుకున్న సంబంధిత అధికారులు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశంలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కూలీలు ఆందోళన విరమించారు.