సిటీబ్యూరో, జూన్ 5(నమస్తే తెలంగాణ):నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా గురువారం రాత్రి నగరవ్యాప్తంగా ఆపరేషన్ కవచ్ పేరిట హైదరాబాద్ సిటీ పోలీసులు ముమ్ముర తనిఖీలు చేపట్టారు. రాత్రి పదిగంటల నుంచి పన్నెండు గంటల వరకు జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా వాహనాల నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌పై ప్రధానంగా దృష్టి పెట్టారు. నెంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్ నేరగాళ్లకు సులభంగా తప్పించుకునే మార్గంగా మారడమే కాకుండా, అమాయకులను తప్పుడు ఈ చలాన్లు, కేసుల గుప్పిట్లోకి నెడుతూ శాంతిభద్రతలకు సవాల్‌గా నిలుస్తున్నదని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
జూబ్లీహిల్స్ వెంకటగిరి, మధురానగర్ కృష్ణకాంత్‌పార్క్, బోరబండ పిలీ దర్గా, సనత్‌నగర్, అమీర్‌పేట సత్యంథియేటర్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెకింగ్ పాయింట్లను సీపీ సజ్జనార్ సందర్శించారు. ఆపరేషన్ కవచ్‌లో భాగంగా నగర వ్యాప్తంగా వివిధ జోన్లలో కలిపి మొత్తం 12098 వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇందులో 8802 ద్విచక్ర వాహనాలు, 1693 నాలుగు చక్రాల వాహనాలు, 1623 ఆటోలు ఉన్నాయి. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్దంగా నంబర్ప్లేట్లు ఉన్న 1406 వాహనాలను, అసలు నంబర్ ప్లేట్ లేని 1132 వాహనాలను, నకిలీ నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న 69 వాహనాలను పోలీసులు గుర్తించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు మొత్తం 2149 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
జోన్ల వారీగా చూస్తే అత్యధికంగా గోల్కొండ జోన్ పరిధిలో 530, చార్మినార్ జోన్లో 444 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్‌ను సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబోమని, అలా చేసేవారిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆపరేషన్ కవచ్‌లో భాగంగా ప్రస్తుతం ఎక్కువగా ద్విచక్రవాహనాలపై దృష్టిపెట్టామని, రాబోయే రోజుల్లో అన్ని రకాల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తామని ఆయన తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో క్రైమ్స్ అదనపు సీపీ ఎం శ్రీనివాసులు, లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, నార్త్ ఏజంవ జాయింట్ సీపీ శ్వేత, డీసీపీలు ఆర్ వెంకటేశ్వర్లు, చైతన్యకుమార్, కిరణ్‌ఖారే, శిల్పవల్లి, ఎస్.శ్రీనివాస్, , చంద్రమోహన్, రమణారెడడి, రాజేశ్, అరవింద్‌బాబు, లావణ్యనాయక్ జాదవ్ పాల్గొన్నారు.